ప్రపంచం మొత్తం మీద  అమరావతి రాజధానికి తానే బ్రాండ్ అంబాసిడర్ అనే భ్రమల్లో బతికారు. తనను చూసే సింగపూర్ కంపెనీలు ఉచితంగా రాజధాని నిర్మాణంలో భాగస్వామ్యం తీసుకున్నట్లు  చెప్పుకున్నారు. తానిచ్చిన పిలుపుతోనే  అమరావతి ప్రాంతంలో రైతులు 34 వేల ఎకరాలను ఉచితంగా రాజధాని నిర్మాణానికి ఇచ్చేసినట్లు ఒకటే ఊదరగొట్టారు.  

 

సీన్ కట్ చేస్తే అమరావతి కోసం తాను చేస్తున్న ఆందోళనల్లో భాగస్వాములు కావటానికి ఇటు రైతులూ రావటం లేదు. అటు మిగిలిన పార్టీలూ కలసిరావటం లేదు. ఇక విద్యార్ధుల సంగతి సరేసరి అసలు పట్టించుకోవటమే లేదు. దాంతో మండిపోతున్న చంద్రబాబు  రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా తాను మాత్రమే ఆందోళనలు చేయాలా ? ప్రతిపక్షాలకు బాధ్యత లేదా ? అంటూ మండిపోతున్నారు. విద్యార్ధులకు వాళ్ళ భవిష్యత్తుపై క్లారిటి లేదా ? అంటూ రెచ్చిపోతున్నారు.

 

నిజానికి చంద్రబాబు చెప్పుకుంటున్నట్లుగా రైతులందరూ తమ భూములను స్వచ్చందంగా త్యాగం చేయలేదు. స్వచ్చందంగా భూములిచ్చిన రైతులు కొంతమందే. మిగిలిన రైతులను భయపెట్టి, ఒత్తిడిపెట్టి, మాయచేశారు. అప్పటికీ భూములివ్వటానికి ఇష్టపడని రైతుల పొలాలను తగలబెట్టించారు. కొందరిపై కేసులు పెట్టి జైళ్ళకు పంపారు. ఇటువంటి కారణాలతో చాలామంది రైతులు ఇపుడు చంద్రబాబుకు మద్దతుగా నిలవటానికి ఇష్టపడటం లేదు. అందుకనే పార్టీ నేతలను పిలిపించుకుని ఆందోళనలు చేయిస్తున్నారు.

 

ఇక విద్యార్ధుల సంగతంటారా ? అధికారంలో ఉన్న ఐదేళ్ళు విద్యార్ధులను ఎంతగా ఇబ్బంది పెట్టారో అందరికీ గుర్తుండే ఉంటుంది. అందుకనే  చంద్రబాబు పిలుపిచ్చినా విద్యార్ధులెవరూ పట్టించుకోలేదు. చివరకు విద్యార్ధులను సమీకరించలేక తెలుగునాడు స్టూడెంట్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు నాదెండ్ల బ్రహ్మం చౌదరి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

 

చివరగా  అధికారంలో ఉన్నంత కాలం చంద్రబాబు ప్రతిపక్షాలను పురుగులను చూసినట్లు చూశారు.  ఏ విషయంలో అఖిలపక్ష సమావేశం పెట్టాలని డిమాండ్ చేసినా అవసరం లేదు పొమన్నారు. పైగా రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే అవసరం లేదన్నారు. అంటే 2050 వరకూ తామే అధికారంలో ఉంటామని భ్రమల్లో ఉన్నారు లేండి. అందుకనే  కళ్ళు మూసుకుపోయి నోటికొచ్చినట్లు మాట్లాడారు. దాని ఫలితమే ప్రతిపక్షంలోకి వచ్చి ఇపుడు అనుభవిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: