దేశ రాజ‌ధాని ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ)లో విద్యార్థుల‌పై జ‌రిగిన దాడి ఘ‌ట‌న‌పై రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు కొన‌సాగుతున్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ఈ ఘ‌ట‌న‌పై సంచ‌ల‌న వ్యాఖ్యానించారు. యూనివర్శిటిలో దాడులు చేసినవారు మాస్కులు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. ముసుగులు ధరించి పిరికిపందల్లా దాడికి పాల్పడ్డ ఆ దుండగులెవరో బయటపడాలని ఉద్ద‌వ్ థాక‌రే అన్నారు. ఒకవేళ దాడి చేసిన నేరస్థులను గుర్తించడంలో ఢిల్లీ పోలీసులు విఫలమైతే.. వారు కూడా నేరంలో భాగస్వాములై   ఉంటారని సీఎం అన్నారు.JNU ఘటనలు టీవీలో చూస్తున్నప్పుడు తనకు 26/11 ముంబయి ఉగ్ర దాడులు గుర్తుకొచ్చాయని మ‌హారాష్ట్ర సీఎం వ్యాఖ్యానించారు. 


మ‌రోవైపు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ సైతం ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.  పిరికిపందల్లాగా ముసుగులు ధరించి యూనివర్శిటి విద్యార్ధులపై రాడ్లు, కర్రలతో దాడి చేయడం ఉపేక్షించలేని చర్యగా ఒవైసీ తెలిపారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రులు కూడా నిస్సహాయత వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారని, పోలీసులు ఎందుకు ఆ గూండాలకు రక్షణగా ఉన్నారో మోదీ సర్కార్‌ చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. నిరసన చేస్తున్న విద్యార్ధులను ఉద్దేశపూర్వకంగా శిక్షించేందుకే ఈ క్రూరమైన దాడులు జరిగాయని ఓవైసీ ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్లే.. దుండగులు  దాడికి తెగబడ్డారని ఓవైసీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

మ‌రోవైపు ఆదివారం జరిగిన హింసాత్మక ఘటనతో అక్కడి విద్యార్ధులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ముసుగులు ధరించి కొందరు దుండగులు యూనివర్సిటీలోకి చొరబడి విద్యార్థులు, టీచర్లపై విచక్షణారహితంగా దాడి చేసిన సంగతి తెలిసిందే. దీంతో  విద్యార్ధులు కొందరు యూనివర్శిటిలో భద్రత లేదని అక్కడి నుంచి వెళుతున్నారు. కాగా, ఈ ఘ‌ట‌న‌పై విద్యార్థి సంఘం నాయ‌కురాలు అయిషే ఘోష్ స్పందించారు. ప‌క్కా ప్లాన్ ప్ర‌కారం విద్యార్థులపై దాడి చేశార‌ని ఆమె అన్నారు. విద్యార్థుల‌ను ఒక్కొక్క‌ర్ని చేసి మ‌రీ అటాక్ చేశార‌న్నారు. జేఎన్‌యూ సెక్యూర్టీ, విధ్వంస‌కారులు ఒక్క‌టై దాడి చేశార‌న్నారు. విధ్వంసం సృష్టిస్తుంటే జేఎన్‌యూ సెక్యూర్టీ అడ్డుకోలేద‌ని ఘోష్ తెలిపారు. ఆర్ఎస్ఎస్ అనుబంధ ప్రొఫెస‌ర్లు గ‌త కొన్ని రోజుల నుంచి దాడికి ఉసి గొల్పుతున్నార‌ని ఆమె పేర్కొన్నారు. ఆర్ఎస్ఎస్‌, ఏబీవీపీ గూండాలు ఆ ప‌నిచేసిన‌ట్లు ఆమె వెల్ల‌డించారు. వైస్ ఛాన్స‌ల‌ర్‌ను త‌క్ష‌ణ‌మే తొల‌గించాల‌ని ఆమె డిమాండ్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: