ఇల్లు లేని పేదలకు స్థలాలు ఇచ్చి, ఇళ్ల నిర్మాణానికి  రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని  వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ భూములు ఉన్న చోట ప్రభుత్వ భూములను, లేని చోట  కొనుగోలు చేసి అయినా ప్రయివేట్ భూములను, అందరికీ ఆమోదయోగ్యమైన చోట పంపిణీ చేస్తామని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా, పొదలకూరు మండలం చాటగొట్ల గ్రామం వద్ద పేదలందరికీ ఇళ్లు పధకం ద్వారా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు ఎంపిక చేసిన లేఅవుట్ అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కాకాని శంఖుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..  ఇళ్ళు లేని పేదవాళ్లకు ఇళ్ళు కట్టించి ఇచ్చిన మహనీయుడు మహానేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి అని శ్లాఘించారు. ఆ తరువాత వచ్చిన ప్రభుత్వాలు పేద వాళ్ళ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. 


గతంలో ఏమి కావాలన్నా జన్మభూమి కమీటీల పేరుతో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుర్మార్గపు పాలన చేశారని తీవ్రంగా దుయ్యబట్టారు. నేడు ప్రజల అవసరాలను వాలంటీర్లతో గుర్తించి సచివాలయ వ్యవస్థ ద్వారా అన్ని  పధకాలను ప్రజల ముంగిటకే అందించేలా ఏర్పాటు చేసిన ఘనత సీఎం  జగ్మోహన్ రెడ్డికి దక్కుతుందన్నారు. గత ప్రభుత్వంలో పట్టాలు చేతికి ఇచ్చారే తప్ప, ఆ స్థలాలు ఎక్కడ ఉన్నాయో తెలియని దుస్థితి అని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఆ విధంగా కాకుండా స్థలాన్ని ఎంపిక చేసి, అభివృద్ధి చేసి, లేఅవుట్ చేసి ఉగాది కల్లా ఇంటి పట్టాలను మీకు పంపిణీ చేస్తామని కాకాని భరోసా కల్పించారు.

మంత్రిగా ఆనం రామనారాయణరెడ్డి, నేను జడ్పీ చైర్మన్ గా ఉన్న సమయంలో మునక  ప్రాంతం నుంచి ఈ ప్రాంతానికి వచ్చి స్థిరపడిన వారికి అప్పట్లో  పట్టాలు ఇవ్వడం జరిగిందన్నారు. కానీ కొందరు వివిధ కారణాలతో కోర్టుకు వెళ్లడం జరిగిందన్నారు. ప్రస్తుతం ఎక్కడా పొరపాట్లు లేకుండా అర్హులైన వారికి స్థలాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ ప్రాంతాల్లో ఇచ్చిన స్థలాలను ఎవరైనా అమ్మినా, కొనుగోలు చేసినా వారిని కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ఇంటి స్థలాలు ఇచ్చే బాధ్యత నాదని హామీ ఇచ్చారని చెప్పారు. గతంలో చంద్రబాబు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు.  కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి  ప్రతి నియోజక వర్గానికి నిధులు ఇస్తున్నారని చెప్పారు.  సర్వేపల్లి నియోజకవర్గాన్ని అన్ని మౌలిక సదుపాయాలతో సమగ్రాభివృద్ధి చేస్తామన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: