అమరావతి నుంచి విశాఖకు రాజధాని తరలింపు దాదాపు ఖాయమైంది . ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను విశాఖ కు తరలించేందుకు సన్నాహాలు ప్రారంభించింది .   జీఎన్ రావు కమిటీ , బోస్టన్ కమిటీ నివేదికలు  విశాఖ  వైపు మొగ్గు చూపిన విషయం తెల్సిందే  . అయినా ప్రతిపక్షాలు రాజధాని తరలింపు వ్యవహారాన్ని రాజకీయం చేయాలని చూస్తోన్న నేపధ్యం లో , విపక్షాలను రాజకీయంగా ఇరుకున పెట్టేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథక రచన చేస్తున్నట్లు తెలుస్తోంది .

 

 అమరావతిని రాష్ట్ర రాజధానిగా ప్రకటించే సమయం లో, ఆనాటి టీడీపీ ప్రభుత్వం  అసెంబ్లీ లో మాత్రమే చర్చకు పెట్టిందని  రాష్ట్ర మంత్రులు పేర్కొంటున్న విషయం తెల్సిందే . టీడీపీ మాదిరిగా తాము కూడా రాజధాని తరలింపు అంశాన్ని  అసెంబ్లీలో మాత్రమే చర్చిస్తే విమర్శలు తప్పవని  అధికార పార్టీ భావిస్తోంది .  రాజధాని తరలింపు అంశం పై చర్చించేందుకు ప్రత్యేక  అసెంబ్లీ  సమావేశాల్ని నిర్వహించడం తోపాటు , అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది  . అసెంబ్లీ సమావేశాల్లో తమ పార్టీ తరుపున మూడు ప్రాంతాల నుంచి  ఎమ్మెల్యేలను ఎంపిక చేసి , మూడు రాజధానుల ప్రతిపాదనకు అనుకూలంగా మాట్లాడించాలని వైస్సార్ కాంగ్రెస్ నాయకత్వం  భావిస్తోంది . అదే సమయం లో టీడీపీ కి చెందిన ఎమ్మెల్యేలు ప్రాంతాలుగా విడిపోతారని అంచనా వేస్తోంది .

 

ఇక జనసేన తరుపున ప్రాతినిధ్యం వహిస్తోన్న ఏకైక ఎమ్మెల్యే ఇప్పటికే మూడు రాజధానుల అంశానికి జైకొట్టిన విషయం తెల్సిందే  . అసెంబ్లీ సమావేశాల అనంతరం అఖిలపక్ష సమావేశాన్నికూడా నిర్వహించి ,  ఈ సమాశానికి  పార్టీ అధ్యక్షుల్ని మాత్రమే ఆహ్వానించాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది . అఖిలపక్ష సమావేశం లో  మూడు ప్రాంతాలలో  మూడు రాజధానులను వ్యతిరేకించే పార్టీల పట్ల , ఆయా ప్రాంతాల్లో  వ్యతిరేకత వ్యక్తం అవుతుందని , అది రాజకీయంగా తమకు లాభిస్తుందని వైస్సార్ కాంగ్రెస్ నాయకత్వం అంచనా వేస్తోంది . 

మరింత సమాచారం తెలుసుకోండి: