ప్రకృతికి కోపం వస్తే ఏం జరుగుతుందో.. ఎంత నష్టం వస్తుందో.. అస్తవ్యస్త పరిస్థితులు ఏర్పడతాయో ఎన్నో ఎన్నోసార్లు తెలియజెప్పింది. ప్రస్తుతం అలాంటి విపత్తే ఆస్ట్రేలియా దేశాన్ని కుదిపేస్తోంది. గతేడాది బ్రెజిల్ దేశంలో వ్యాపించిన కార్చిచ్చు ఏస్థాయిలో విజృంభించిందో తెలిసిందే. ప్రపంచానికి ఇరవై శాతానికి పైగా ఆక్సిజన్ అందించే పచ్చని పర్యావరణం అగ్నికి ఆహుతైపోయింది. ప్రస్తుతం అదే పరిస్థితి ఆస్ట్రేలియాను అతలాకుతలం చేస్తోంది. న్యూ సౌత్ వేల్స్ లోని పచ్చని కారడివి దహనకాండకు గురవుతోంది.

 

 

గతేడాది సెప్టెంబర్ లోనే ఈ దహనం మొదలై ఇప్పుడు తీవ్ర రూపం దాల్చిందని తెలియవస్తోంది. విపరీతమైన మంటలతో అగ్నికి అడవులు దహనమైపోతున్నాయి. వేలాది జంతువులు అగ్ని కీలల్లో ఆహుతైపోతున్నాయి. ఈ మంటలు సిడ్నీ నగరాన్ని కూడా వ్యాపించాయి. ఈ అగ్నికీలల్లో ఇప్పటికే 24 మంది వరకూ చనిపోగా వేలాదిగా జంతువులు బలైపోయాయని తెలుస్తోంది. దీంతో ఆస్ట్రేలియాలో అత్యవసర పరిస్థితిన ప్రకటించారు. గత రెండు రోజులుగా ఈ మంటలు మరింత వ్యాపించాయి. దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో కార్చిచ్చు రగులుతోంది. ఉష్ణోగ్రతలు కూడా 48 డిగ్రీలు దాటిపోయాయి. ఆకాశమంతా దట్టమైన పొగతో నల్లబడిపోతోంది. ఎన్నో జంతువులు దిక్కులు వెతుక్కుంటూ వెళ్లిపోతున్నాయి. 

 

 

ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మూడు వేల మంది సైన్యం ఈ మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మంటలు ఆర్పేందుకు ఉద్యమిస్తున్నారు. ఈ కార్చిచ్చుతో పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పర్యావరణ హితం కోరుతూ ప్రపంచ దేశాలు పర్యటిస్తున్న గ్రెటా ధన్ బర్గ్ తో సహా పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. అడవులు అంతరించిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇలాంటి కార్చిచ్చులకు పచ్చని అడవి మాడిపోవడం ప్రపంచానికి మంచిది కాదు. వేలాది హెక్టార్లలో స్వచ్ఛమైన అడవి తగలబడిపోవడం ఎంతైనా బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: