విద్యుత్ ఉద్యోగుల విభజన అంశం మళ్ళీ మొదటికి వచ్చింది. ఆరు సంవత్సరాల నుంచి ఆంద్రప్రదేశ్, తెలంగాణ విద్యుత్ ఇంజినీర్ల పంపిణీపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరుగుతూ వచ్చినా... అంతిమంగా ఇచ్చిన తీర్పుపై ఇరు పక్షాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. జస్టిస్ ధర్మాధికారి కేటాయింపులపై ఏపీ విద్యుత్ ఇంజినీర్లు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో... ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది.


 
తెలుగు రాష్ట్రాల విద్యుత్తు సంస్థల్లో ఉద్యోగుల పంపకాల వివాదం కొనసాగుతోంది. ఉద్యోగులను రెండు రాష్ట్రాలకు పంచుతూ డిసెంబర్ 26న జస్టిస్‌ ధర్మాధికారి కమిటీ సుప్రీంకోర్టుకు నివేదికను అందజేసింది. అయితే ఏపీకి వెళ్తామని ఆప్షన్ ఇచ్చిన 632 మంది ఇంజినీర్లను ఏపీ ప్రభుత్వం తీసుకోవడానికి నిరాకరించడంతో వారంతా సుప్రీంకోర్టును మరోసారి ఆశ్రయించారు. ఇదే విషయమై ఏ ఒక్క ఉద్యోగినీ తెలంగాణ సంస్థల నుంచి రిలీవ్‌ చేయవద్దని ఏపీ ట్రాన్స్‌కో సీఎండీ..ఇటీవల తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీకి లేఖ రాశారు. తెలంగాణ నుంచి ఎవరినైనా రిలీవ్‌ చేస్తే వారికి నియామక ఉత్తర్వులు ఇవ్వలేమని స్పష్టం చేశారు.

 

గత శనివారం తెలంగాణ విద్యుత్తు సంస్థల నుంచి 655 మందిని రిలీవ్‌ చేశారు. కమిటీ ఆదేశాల ప్రకారం వీరిని ఏపీ విద్యుత్తు సంస్థల్లో చేర్చుకోవాలి. కానీ ఏపీ సంస్థల తాజా నిర్ణయంతో వీరు ఎక్కడా పనిచేయలేక ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ పెద్దలు విద్యుత్ ఇంజినీర్ల విభజన అంశంలో జోక్యం చేసుకుని ..సమస్యను పరిష్కరించాలని తెలంగాణ విద్యుత్ ఇంజనీర్ల సంఘం డిమాండ్ చేస్తోంది.

 

ఆరు సంవత్సరాలుగా విద్యుత్ ఇంజినీర్స్ మధ్య వివాదం సద్దుమణుగక పోవడంతో తెలంగాణ ఇంజినీర్స్ కు ప్రమోషన్స్ రాక ఇబ్బందులు పడుతున్నారు. జస్టిస్ ధర్మాధికారి తీర్పు ప్రకారం... సుమారు 800 ఇంజినీర్స్ కు మళ్ళీ తెలంగాణలో విధులు కేటాయించాల్సి ఉంటుంది. దీంతో తెలంగాణ ఇంజినీర్స్ కు ఇచ్చిన ప్రమోషన్ల విషయంలో యాజమాన్యం ఎలాంటి వైఖరి అవలభిస్తుందోననే ఉత్కంఠ ఉద్యోగుల్లో నెలకొంది. తెలంగాణ నుంచి సీనియర్‌ ఉద్యోగులు 655 మందిని చేర్చుకుంటే వారి ఉద్యోగ విరమణ, అనంతరం చెల్లింపుల వరకూ మొత్తం 4వేల500 కోట్ల ఆర్థికభారం పడుతుందని ఏపీ విద్యుత్తు సంస్థలు లెక్కించాయి. ప్రస్తుతం సంస్థలు నష్టాల్లో ఉన్నందున అంత ఆర్థికభారం మోయలేమనేది వారి వాదన. 

మరింత సమాచారం తెలుసుకోండి: