సంక్రాంతి సంబరాల కోసం గోదావరి జిల్లాల్లో సర్వం సిద్దమవుతోంది. ఇక కోడిపందాల కోసం బరులు తయారవుతుంటే, వాటికి అనుబంధంగా మినీ క్యాసినోలకు ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నాయి. కోడిపందాలు ఒక ఎత్తైతే వాటి ముసుగులో జరిగే జూదం మరో ఎత్తు. లక్షల్లో అద్దెలు కట్టి మరీ ఏర్పాట్లు చేస్తున్నారంటే ఏ స్థాయిలో జూదం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. పండగ సరదా పేరుతో జరిగే  జూదంపై జిల్లావాసుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది.

 

పశ్చిమగోదావరి జిల్లాలో సంక్రాంతి పండగ సందడి జోరందుకుంది. పండగ సరదాల్లో ప్రధానమైన కోడి పందాల కోసం బరులు రెడీ అయిపోయాయి. కోడిపందాల బరుల వద్ద తిష్ట వేసుక్కూర్చునే పేకాట రాయుళ్ల కోసం మినీ క్యాసినోలు రెడీ అయ్యాయి. లోనాబయట, పులి,ఏనుగు ఆటలతో పాటు కాయ్ రాజా కాయ్ సిద్ధం చేసేశారు క్యాసినోల యజమానులు.   

 

కోడిపందాల బరుల వద్ద జరిగే ఈ కోలాహలానికి అలవాటు పడిన పందెం రాయుళ్లు ఏడాదంతా సంపాదించింది కాస్తా అక్కడే కర్పూరంలా కరిగించి పారేస్తారు. పేకాట, లోనాబయట, గుండాట లాంటి ఆటలకు లక్షల్లో అద్దెలు చెల్లించి మరీ బోర్డులు నడిపే నిర్వాహాకులు అంతకు పదింతలు సంపాదించుకుని కామ్ గా చెక్కేస్తారు. దీంతో సరదాగా పండగ చూద్దామని వచ్చేవారికి డబ్బులన్ని ఖాళీ అయి రోడ్డున పడుతున్నారు. అందుకే ఈసారి జరిగే పందాల్లో కోడిపుంజుల సంగతెలా ఉన్నా ఇతర జూదాల్సి మాత్రం పూర్తిగా అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు జిల్లా వాసులు. 

 

జిల్లా వ్యాప్తంగా జరిగే కోడిపందాల వ్యాపారం ఒక ఎత్తయితే.. కోడిపందాల బరుల వద్ద ఏర్పాటు చేసే మిని క్యాసినోల వ్యాపారం మరోఎత్తు. పదిరూపాయల నుంచి మొదలయ్యే పేకాట వందలు, వేలల్లో సాగుతుంది. గుండాటలు ఒక్కసారి ఆడటం మొదలు పెడితే చాలు మొదట డబ్బులు వచ్చినట్టే వచ్చి అంతలోనే పర్సుకాళీ అయిపోవడం నిమిషాల్లో జరిగిపోతుంది. కోడిపందాలు సాంప్రదాయకంగా నిర్వహించి ఇలాంటి జూదాలను అడ్డుకోవాలని ఎంత మంది ప్రయత్నించినా ఫలితం ఉండట్లేదు. అందుకే ఈ సారి జూదాలపై మాత్రం ఫుల్ ఫోకస్ పెట్టాలంటున్నారు జిల్లా వాసులు. 

 

ఇక కోడిపందాలు కోసం వచ్చే అతిధులకు ఈ సారి లిక్కర్ దుకాణాలు పెద్దగా కనిపించకపోవచ్చు. ప్రభుత్వం మద్యం కట్టడి చేసిన మాదిరిగానే.. కోడిపందాల బరుల వద్ద జరిగే జూదంపైన దృష్టి సారించాలని జిల్లావాసులు కోరుకుంటున్నారు. అప్పుడే  అసలైన పండగ సందడి కనిపిస్తుందన్నది వారి భావన.

మరింత సమాచారం తెలుసుకోండి: