తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిత్యం ఎవరో ఒకరిని టెన్షన్ పెడుతూనే ఉన్నారు. మొన్ననే మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై పార్టీ కీలక నాయకులందరికీ గట్టిగా క్లాస్ పీకిన కేసీఆర్ ఎట్టి పరిస్థితితుల్లోనూ తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ సూచించిన అభ్యర్థులు గెలిచి తీరాలని, ఆ బాధ్యత మంత్రులు, ఎమ్యెల్యేలు తీసుకుని నియోజకవర్గాల వారీగా తీసుకుని పార్టీ నాయకులతో ఆత్మీయ సమావేశం నిర్వహించాలని, ఫలితాల్లో తేడా వస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయంటూ హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఈ విషయంలో మంత్రులు సక్రమంగా పనిచేయకపోతే వారి పదవులు ఊడతాయంటూ హెచ్చరికలు చేశారు.


 ఈ నేపథ్యంలో మంత్రుల్లో ఎక్కడలేని భయం నెలకొంది. తమ ప్రాంతాల్లో పార్టీ ఓడిపోతే తమ పదవులు పోతాయనే భయం ఆయా మంత్రులను వెంటాడుతోంది. వాస్తవంగా కేసీఆర్ మొన్నటి మంత్రివర్గ విస్తరణలోనే ఐదుగురు మంత్రులను తప్పించాలని చూసారు. వారి పనితీరు అంతగా లేదు అనే కారణంతో వారిని తప్పించి కొత్త వారిని తీసుకుంటారని ప్రచారం జరిగింది. మంత్రి మల్లారెడ్డి, ఈటెల సహా మరో ముగ్గురిని తొలగించి కొత్త వారికి అవకాశం ఇస్తారని అంతా అనుకున్నారు. కానీ అప్పట్లో చెలరేగిన వివాదాల కారణంగా కేసీఆర్ కాస్త వెనక్కి తగ్గారు. అయితే మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చారు. 


ఈమేరకు పార్టీ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మున్సిపల్ ఫలితాలు వచ్చిన తరువాత ఫిబ్రవరిలో కేసీఆర్ కేబినెట్ విస్తరణ చేయాలని చూస్తున్నట్టు సమాచారం. ఆ విస్తరణలో కేటీఆర్ కు అనుకూలమైన వారిని మంత్రి వర్గంలోకి తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుకే ముందుగా మున్సిపల్ ఎన్నికల్లో విఫలమైన వారిని తప్పించి కొత్త టీమ్ ను ఏర్పాటు చేసి కేటీఆర్ కు అనుకూల పరిస్థితులు కల్పించాలని కేసీఆర్ చూస్తున్నట్టు అర్ధం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: