ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో కొందరు రైతులు రాష్ట్ర రాజధానిగా అమరావతిని మాత్రమే ఉంచాలని, అలానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ధర్నాలు, దీక్షలతో అమరావతి, వెలగపూడిలలో హోరెత్తిస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే నేడు తమ దీక్షలలో భాగంగా కొందరు రైతులు సచివాలయానికి వెళ్తున్న ముఖ్యమంత్రి జగన్ కాన్వాయిని అడ్డగించబోయారు. అయితే అప్పటికే పోలీసులు వారిని అడ్డుకోవడంతో ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్లిపోవడం జరిగింది. అనంతరం వారు గుంటూరు జిల్లా చినకాకాని ప్రాంతం వద్ద కూడా నిరసన చేపట్టగా, 

 

అదే సమయంలో అటువైపుగా వెళ్తున్న ప్రభుత్వ చీఫ్ విప్ పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి కారుని అడ్డగించడం జరిగింది. నిజానికి అక్కడ అంతకముందు కొద్దిపాటి ట్రాఫిక్ జామ్ కావడంతో రామకృష్ణ రెడ్డి కారు ఆ ట్రాఫిక్ లో ఇరుక్కుంది. దానిని గమనించిన రైతులు ఒక్కసారిగా రామకృష్ణ రెడ్డి కారును అడ్డగించడం, అలానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడం జరిగింది. అంతటితో ఆగకుండా ఆయన కారుపై రాళ్లు రువ్వడంతో, వెంటనే అక్కడికి పోలీసులు రంగప్రవేశం చేసి, ఆందోనళ చేస్తున్న వారిని చెదరగొట్టి రామకృష్ణ రెడ్డి కారును అక్కడినుండి పంపించి వేశారు. 

 

కాగా అక్కడ కాసేపు ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకోవడంతో పోలీసులు మరింతగా చొరవ తీసుకుని గొడవని సర్దుమణిగేలా ప్రయత్నాలు చేసారు. కాగా ఈ ఘటనపై కొందరు వైసిపి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ గారు, రాష్ట్రంలోని ప్రజలందరి సౌభాగ్యం కోసం ఆలోచిస్తూ మూడు ప్రాంతాలను రాజధాని ప్రాంతాలుగా ఎన్నుకోవడం జరిగిందని, అలాగని అమరావతి ప్రాంత రైతులను అన్యాయం చేస్తాం అని తామెక్కడా చెప్పలేదని, ఇదంతా కూడా టిడిపి నాయకులు ప్రజలను రెచ్చగొడుతూ ఆడుతున్న నాటకంలో భాగం అని వారు అంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు చేసిన తప్పిదాల వల్లనే నేడు రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, ఆ విధంగా తాము చేసిన తప్పులను కప్పిపుచ్చుకుని, బాబు నేడు ప్రజలను మా ప్రభుత్వంపైకి రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: