విశాఖను ఏపీ రాజధానిగా చేయాలని ఏపీ సీఎం జగన్ గట్టిగా నిర్ణయించుకున్న తరుణంలో మరోసారి ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రతిపాదనలు వస్తున్నాయి. విశాఖను రాజధానిగా చేస్తే రాయలసీమకు బాగా దూరం అవుతుందన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఈ మేరకు కొత్త డిమాండ్లు వస్తున్నాయి. కర్నూలు జిల్లా తెలంగాణకు చాలా దగ్గరగా ఉంటుంది. అందులోనూ వారికి అమరావతి కంటే హైదరాబాదే దగ్గర. అయినా రాష్ట్రం విడిపోయినప్పుడు పెద్దగా బాధపడలేదు. ఇప్పుడు విశాఖను రాజధానిగా చేస్తున్న తరుణంలో తమను తెలంగాణలో కలిపేయాలంటూ కొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు. కర్నూలు జిల్లాను తెలంగాణలో కలపాలని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.



ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో కూడా కర్నూలు అనంతపురం జిల్లాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్‌ను ఆయన గుర్తుచేశారు. అయితే నాటి పరిస్థితుల కారణంగా అది సాధ్యపడలేదని అన్నారు. తాజాగా రాష్ట్ర రాజధానిని విశాఖపట్టణం తరలిస్తే రాయలసీమ మరింత వెనుకబాటుకు గురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు అనంతపురం జిల్లాను కర్ణాటకలో కలపాలని మరికొందరు నేతలు డిమాండ్ చేస్తున్నారు.



అనంతపురం జిల్లాలోని టీడీపీ నేతలు కొందరు తమ జిల్లాను కర్నాటక రాష్ట్రంతో కలపాలంటున్నారు. కర్ణాటకతో ఉన్న అనుబంధం, కన్నడ జీవన శైలి, ఆ ప్రాంతంతో ఉన్న బంధుత్వం, బెంగళూరు నగరం అత్యంత సమీపంలో ఉన్న కారణంగా కర్నాటకలో జిల్లాను కలపాలని కోరుతూ ప్రకటనలు ఇస్తున్నారు.

 

ఇప్పటికే ముఖ్యమంత్రికి లేఖలు రాసిన గ్రేటర్ రాయలసీమ నేతలు.. రాజధాని గ్రేటర్ రాయలసీమలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు వారు ముఖ్యమంత్రికి లేఖ కూడా రాశారు. అయితే ఇంత వరకు ఎలాంటి సమాధానం రాలేదు. మరి ఇప్పుడు ఇంకెలాంటి డిమాండ్లు వస్తాయో మరి. ఏదేమైనా రాయలసీమ వాసులకు విశాఖ వెళ్లిరావడం మాత్రం కష్టసాధ్యమైన పనే.

మరింత సమాచారం తెలుసుకోండి: