అమరావతి ఆందోళనలు తీవ్రరూపు దాల్చాయి. నిన్న భారీపాదయాత్రతో హోరెత్తించిన రైతులు, మహిళలు.. ఈ రోజు చినకాకాని వద్ద జాతీయరహదారిని దిగ్భందించారు.  వేలాదిమంది రైతులు రహదారిపైకి రావడంతో రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ క్లియర్ చేసిన పోలీసులు.. రైతులను అరెస్ట్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా పలువురు టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. బెంజిసర్కిల్ దగ్గర  లోకేష్ తో పాటు కొల్లురవీంద్ర, రామానాయుడులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 

రైతులు, మహిళల ఆందోళనలతో రాజధాని ప్రాంతం రగిలిపోతోంది. అమరావతి జేఏసీ పిలుపుమేరకు..వేలాది మంది రైతులు జాతీయ రహదారిని దిగ్భందించారు. పోలీసుల బూట్లు తుడుస్తూ నిరసన తెలిపారు. వేలాది మంది రైతులు.. హైవేకి చేరుకోవడంతో దాదాపు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ చినకాకాని వద్ద ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. అతి కష్టం మీద పోలీసులు రైతులను పక్కకు లాగి మంత్రి కాన్వాయ్‌ వెళ్లేందుకు ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. రైతులను గుంటూరు, హాయ్ ల్యాండ్ కు తరలించారు. దీంతో రైతులు హాయ్ ల్యాండ్‌లో ఎండలో నిల్చుని నిరసన తెలిపారు.

 

రైతుల ఆందోళనలు, పోలీసుల అరెస్టులతో చినకాకాని రణరంగాన్ని తలపించింది. పోలీసులతో రైతులు ఆందోళనకు దిగారు. హైవేపై బైఠాయించిన టీడీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు జీవి ఆంజనేయులను.. పోలీసులు అరెస్ట్ చేసి గుంటూరు తరలించారు.  మాజీ మంత్రులు నక్కా ఆనందబాబు, ప్రత్తిపాటి పుల్లారావు, సీనియర్‌ నేతలు బోడె ప్రసాద్‌, యలమంచిలి రాజేంద్రప్రసాద్‌, ఎంపీలు కేశినేని నాని, గల్లా జయదేవ్‌, గంజి చిరంజీవి తదితరులను గృహనిర్బంధం చేశారు.

 

చినకాకాని వద్ద జాతీయ రహదారి దిగ్బంధంలో పాల్గొనేందుకు బయల్దేరిన నారా లోకేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లోకేశ్‌తో పాటు మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే రామానాయుడిని బెంజిసర్కిల్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ చేపట్టిన దీక్షలో పాల్గొని లోకేశ్‌ తిరిగి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. అవనిగడ్డ- విజయవాడ కరకట్ట రహదారి మీదుగా తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌కు లోకేశ్‌ను తీసుకెళ్లారు. అమరావతి నుంచి రాజధానిని మార్చడమంటే.. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడమేనని ఘాటు వ్యాఖ్యలుచేశారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. 

 

గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ నివాసం దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చినకాకాని దగ్గర రహదారి దిగ్బందానికి బయలుదేరిన జయదేవ్ ను.. ఆయన నివాసం దగ్గరే అడ్డుకొని పోలీసులు నోటీసులిచ్చారు. దీంతో రాజధాని రైతులకు మద్దతుగా అనుచరులు, కార్యకర్తలతో కలిసి తన నివాసం వద్దే జయదేవ్‌ నిరసన తెలిపారు. రాష్ట్రచరిత్రలోనే ఇది చీకటి  రోజని అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుని ప్రభుత్వం.. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మండిపడ్డారు. విజయవాడలో దేవినేని ఉమ, చిలకలూరిపేటలో పత్తిపాటి పుల్లారావును గృహ నిర్బంధంలో ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: