రాష్ట్రంలో రాజధాని మార్పు అంశంపై నియమించిన హైపవర్ కమిటీ తొలిసారి సమావేశమైంది. ఈ తొలి సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే ఇంకా మరికొన్ని భేటీలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి వికేంద్రీకరణ అవసరం అని హైపవర్‌ కమిటీ భావించింది. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించి పరిపాలన వికేంద్రీకరణ అవసరమని ప్రాథమిక అంచనాకు వచ్చామని తెలిపింది. అయితే విశాఖ రాజధానిగా బెటర్ అని తొలి భేటీలోనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

 

హైపర్ కమిటీ భేటీ వివరాలను వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు వివరించారు. జీఎన్‌రావు నివేదిక, బోస్టన్‌ కన్సల్టెన్సీ గ్రూపు నివేదికపై సమగ్ర అధ్యయనం చేసేందుకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హైపవర్‌ కమిటీని నియమించడం జరిగిందన్నారు. ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన నియమించిన కమిటీలో డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, పేర్ని నాని, సుచరిత, గౌతమ్‌రెడ్డి, ఆదిమూలపు సురేష్, ఉన్నతాధికారులు ఉన్నారు.

 

ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అధ్యక్షతన విజయవాడలో జరిగిన కమిటీ తొలి సమావేశం ముగిసిన అనంతరం వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చర్చ జరుగుతుందన్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణ అవసరం అని హైపర్‌ కమిటీ భావించిందన్నారు. దీనిపై తదుపరి సమావేశంలో సుదీర్ఘంగా చర్చించి ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత ప్రభుత్వానికి అందించేందుకు నివేదిక తయారు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించడం జరిగిందన్నారు.

 

గతంలో జరిగిన విషయాలను కమిటీలో చర్చించడం జరిగింది. ఇది ప్రాథమిక చర్చ మాత్రమేనని మంత్రి బుగ్గన చెప్పారు. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అన్ని పరిశీలించి ప్రజలందరి అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోకుండానే టీడీపీ లాండ్‌ ఆర్డర్‌ ఇష్యూ చేయడానికి ప్రయత్నిస్తుందని, దీన్ని తప్పుగా భావిస్తున్నామన్నామని బుగ్గన తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: