తెలంగాణలో బలమైన పార్టీగా అవతరించాలని చాలా కాలంగా ప్రయత్నిస్తున్న బిజెపి దానికి తగ్గట్టుగానే పార్టీలోకి వలసలను పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని చూస్తోంది. అయితే ఆ పార్టీలోకి చేరికలు ఈ మధ్యకాలంలో పెద్దగా జరగలేదు. టీఆర్ఎస్ ను దెబ్బ కొట్టి వచ్చే ఎన్నికలనాటికి అధికారం దక్కించుకోవాలని చూస్తోంది. అయితే చాలామంది రాజకీయ ఉనికి కోసం ఆరాటపడుతున్న నాయకులు బిజెపిలో చేరి తమ రాజకీయ భవిష్యత్తును మార్చుకోవాలని చూస్తున్నారు. కానీ కొంతమంది విషయంలో బిజెపి అధిష్టానం నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో వారి చేరిక వాయిదా పడుతూ వస్తోంది. ఆ విధంగానే వేచి చూస్తున్న టిడిపి మాజీ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు కి ఈ రోజు గ్రీన్ సిగ్నల్ రావడంతో ఆయనబీజేపీలో చేరారు. నిన్న ఢిల్లీ వెళ్లిన ఆయన ఈరోజు బిజెపి కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు.


 తాను ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే బిజెపిలో చేరాను అంటూ ఆ సందర్భంగా ఆయన చెప్పారు. మోదీ నేతృత్వంలో ఈ దేశం మరింత అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ని ఉద్దేశించి మోత్కుపల్లి విమర్శలు చేశారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అని, ఎన్నికల ముందు ప్రజలను మోసం చేస్తున్నారని, కెసిఆర్ ను ఓడించే సత్తా బీజేపీకి మాత్రమే ఉంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఇక మోత్కుపల్లి చేరికను కూడా మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది.


 మోత్కుపల్లి  చాలా కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. టిఆర్ఎస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. కానీ కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవడంతో ఆయన చేరిక వాయిదా పడుతూ వచ్చింది. ప్రస్తుతం బిజెపి.లో ఆయన చేరికలు మొదలవ్వడంతో టీఆర్ఎస్, కాంగ్రెస్ లో ఉన్న అసంతృప్తులు బీజేపీలో చేరతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: