మున్సిపోల్స్ ఒక్కసారి అభ్యర్థిని ప్రకటించిన తరువాత ఆ అభ్యర్థి గెలుపు కోసం పార్టీ నేతలు , ప్రజాప్రతినిధులు కృషి చేయాల్సిందేనని గులాబీ దళపతి , తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల తెలంగాణ భవన్ లో జరిగిన సమావేశం లో స్పష్టం చేశారు . మున్సిపోల్స్ లో అభ్యర్థుల ఎంపిక , బీ ఫామ్ లను అందజేసే బాధ్యతను స్థానిక ఎమ్మెల్యేలకే అప్పగిస్తున్నట్లు ప్రకటించారు .  అయితే నకిరేకల్  లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఖరారు చేసే అభ్యర్థులను ఓడించేందుకు మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులు సన్నాహాలు చేస్తున్నారు  .

 

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో   కాంగ్రెస్ తరుపున విజయం సాధించిన చిరుమర్తి లింగయ్య , అనంతరం రాజకీయ పరిణామాల నేపధ్యం టీఆరెస్ పార్టీ లో చేరారు . అయితే లింగయ్య చేరికను వేముల వీరేశం తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నారు . ఒకే పార్టీలో కొనసాగుతున్న లింగయ్య , వీరేశం లు ఎవరిదారి వారే అన్నట్టు వ్యవహరిస్తున్నారు . ఇద్దరి మధ్య సఖ్యత కుదిర్చేందుకు పార్టీ అగ్ర నేతలు తీవ్ర ప్రయత్నాలే చేశారు . కానీ ఇరువురు నేతలు మాత్రం పంతాలకుపోయి , ఎవరివర్గాన్ని వారు ప్రోత్సహిస్తూ వస్తున్నారు . మున్సిపోల్స్ ను తమకు అనుకూలంగా మల్చుకుని వీరేశం వర్గీయులు ,  చిరుమర్తి వర్గం పైచేయి సాధించేందుకు ఎత్తుగడ వేస్తున్నారు . మున్సిపోల్స్ లో  చిరుమర్తి నిలబెట్టే అభ్యర్థులను ఓడించేందుకు , వీరేశం వర్గీయులు రెబల్ గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది .

 

అంతటితో ఆగకుండా వీరేశం వర్గీయులు స్థానిక  కాంగ్రెస్ నేతల మద్దతు కూడగొట్టే ప్రయత్నాన్ని చేస్తున్నట్లు తెలుస్తోంది . కాంగ్రెస్ నేతలు కూడా చిరుమర్తి వర్గీయులను ఓడించేందుకు , వీరేశం వర్గీయులతో చేతులు కలిపేందుకు రెడీ అయినట్లు సమాచారం . అదే జరిగితే మున్సిపోల్స్ లో చిరుమర్తి  కి షాక్ తప్పకపోవచ్చునని పరిశీలకులు   అంటున్నారు .  

మరింత సమాచారం తెలుసుకోండి: