బీసీజీ నివేదికపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి , మాజీ మంత్రి లోకేష్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు . బీసీజీ నివేదికలో కనీసం అమరావతి , విశాఖ పేర్లు కూడా తప్పుల్లేకుండా రాయలేనివారు, మనకు అభివృద్ధి ఎలా చేయాలో చెబుతారంట అంటూ ఎద్దేవా చేశారు . ఇక రాష్ట్ర ప్రభుత్వం నియమించిన అత్యున్నత కమిటీ పై లోకేష్ విమర్శలు గుప్పించారు . అత్యున్నత కమిటీ లో ఉన్నవారంతా మంత్రులేనని , జగన్మోహన్ రెడ్డి నిల్చోమంటే ... నిల్చుంటారని , కూర్చోమంటే ...కూర్చుంటారని ఎద్దేవా చేశారు .

 

హైపవర్ కమిటీ అంటూ వేశారని దానికి ఏమి  హైపవర్ ఉందని   , అది  నో పవర్ కమిటీ అంటూ అపహాస్యం చేశారు . మాట తప్పం ..మడతిప్పం అన్న వ్యక్తి అన్ని తప్పాడు.. అన్ని తిప్పాడని అంటూ జగన్ పై లోకేష్ విరుచుకుపడ్డారు . సాయంత్రం ఆరు గంటలకు వెళ్లి రెండు గంటలపాటు వీడియో గేమ్స్ తో కాలక్షేపం చేసే జగన్ , రాష్ట్ర ప్రజలతోను వీడియో గేమ్స్ ఆడుకుంటున్నారని విమర్శించారు . రాష్ట్ర ప్రభుత్వం మూడు ప్రాంతాల్లో మూడు రాజధానుల ఏర్పాటుకు ప్రతిపాదించిన విషయం తెల్సిందే . రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం జీఎన్ రావు నిపుణుల కమిటీతోపాటు , బీసీజీ నివేదికను కోరింది .

 

ఈ రెండు కమిటీలు కూడా మూడు రాజధానుల ఏర్పాటు చేయాలని సూచించాయి . జీఎన్ రావు కమిటీ , బీసీజీ నివేదికల పై  టీడీపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు . బీసీజీ కమిటీ అమరావతి , విశాఖ పేర్లను కూడా తప్పుగా రాసిందంటూ  లోకేష్ కొత్త పాయింటు లేవనెత్తి , ప్రభుత్వాన్ని ఇరకాటం లోకి నెట్టే ప్రయత్నాన్ని చేశారు . అయితే పేర్లు తప్పుగా రాసినంత మాత్రాన నివేదికను తప్పుపట్టడం విడ్డూరంగా ఉందని అధికార పార్టీ నేతలు మండిపడుతున్నారు . 

మరింత సమాచారం తెలుసుకోండి: