ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారులు ఇప్పటికే విశాఖకు సచివాలయాన్ని తరలించటానికి సిద్ధమయ్యారు. మొదట అధికారులు కొన్ని శాఖలను విశాఖకు తరలించనుండగా ఆ తరువాత మిగిలిన శాఖలను విశాఖకే తరలిస్తారని తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుండి తాత్కాలికంగా సచివాలయ కార్యకలాపాలు వైజాగ్ నుండి ప్రారంభించాలని అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. 
 
మరోవైపు ఏపీ సచివాలయ ఉద్యోగులు మాత్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని సమాచారం. సచివాలయ ఉద్యోగులు సెక్రటేరియట్ లో జరిగిన సెక్రటేరియట్ సమావేశానికి హాజరు కాగా ఈ సమావేశంలో ఒక సచివాలయ ఉద్యోగి కన్నీటి పర్యంతమైందని సమాచారం. మిగతా సచివాలయ ఉద్యోగులు కూడా సచివాలయం తరలింపు విషయంలో తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 
 
కొందరు ఉద్యోగులు ఉమ్మడి ఆంద్రప్రదేశ్ రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత అమరావతికి రాక తప్పలేదని అమరావతిలో తాము ఇప్పటికే లోన్లు తీసుకొని ఇళ్లు కొనుగోలు చేశామని చెబుతున్నారు. ఇప్పుడు సచివాలయాన్ని విశాఖకు తరలించటం వలన తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో మరో ప్రభుత్వం అధికారంలోకి వస్తే సచివాలయం తరలించరని నమ్మకం ఏమిటి...? అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. 
 
చాలా మంది సచివాలయ ఉద్యోగుల పిల్లలు రాష్ట్రం విడిపోయిన తరువాత కూడా తమ పిల్లలను హాస్టళ్లలో ఉంచి హైదరాబాద్ లో చదివిస్తున్నారు. ఇప్పుడు విశాఖకు సచివాలయం తరలించటం వలన విశాఖ నుండి హైదరాబాద్ కు ప్రయాణం చాలా కష్టమని ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రం విడిపోయింది కాబట్టి అమరావతికి రాక తప్పలేదని కానీ ఇప్పుడు సచివాలయ తరలింపు మాత్రం అవాంఛనీయమని సచివాలయ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. హైపవర్ కమిటీ నివేదిక తరువాత ప్రభుత్వం రాజధానుల గురించి అధికారికంగా ప్రకటన చేయనున్నా ఇప్పటికే విశాఖను ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా మార్చేందుకు ఏర్పాట్లు మాత్రం చకచకా జరుగుతున్నాయి. 

 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: