ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం ఆర్టీసీ చార్జీలను పెంచిన విషయం తెలిసిందే. ఆర్టీసీ చార్జీల పెంపు మరవక ముందే రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు రూపంలో ఏపీ ప్రజలకు మరో షాక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్తు పంపిణీ సంస్థ(ఏపీఎస్పీడీసీఎల్) 2020 - 2021 ఆర్థిక సంవత్సరానికి విద్యుత్తు చార్జీల పెంపు ప్రతిపాదనల గురించి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. 
 
రేపటినుండి మూడు రోజుల పాటు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుందని సమాచారం. ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ హరనాథరావు నిన్న ఒక ప్రకటనలో చార్జీల పెంపు ప్రతిపాదనపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనున్నట్టు తెలిపారు. రేపు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్ర ఆవరణలో చార్జీల పెంపు ప్రతిపాదనల గురించి ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. ఈ నెల 10వ తేదీన కడప జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. 
 
ఈ నెల 11వ తేదీన తిరుపతి ఎస్పీడీసీఎల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 10గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు ప్రజాభిప్రాయ సేకరణ జరగనుంది. విద్యుత్ చార్జీల పెంపుకు వైసీపీ పభుత్వం కూడా సానుకూలంగా ఉందని సమాచారం. విద్యుత్ చార్జీల పెంపు ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ ఇప్పటికే చార్జీల పెంపు దిశగా అధికారులకు సూచనలు చేసినట్టు సమాచారం. 
 
ప్రభుత్వం చార్జీలను పెంచితే వినియోగదారులపై భారీగా భారం పడే అవకాశం ఉంది. వార్షిక ఆదాయ నివేదికలో డిస్కంలు వచ్చే ఆర్థిక సంవత్సరానికి 44,840.86 కోట్ల రూపాయలు అవసరమవుతాయని పేర్కొన్నట్టు సమాచారం. డిస్కంలు వార్షిక ఆదాయ నివేదికలో ఆర్థిక పరిస్థితి, రాబడి, నిర్వహణ వ్యయాలు, లోటు మొదలైన వివరాలను పొందుపరిచారని సమాచారం. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం టారిఫ్ ఉత్తర్వులు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: