రాష్ట్రంలో అధికార పార్టీ వైసిపి అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ముందుకు దూసుకు వెళ్తూ ఉండడం ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ కి నిద్ర లేకుండా చేస్తోంది. అందుకే ఏదో ఒక అంశంతో అధికార పార్టీని ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తూ వస్తోంది అనే విమర్శలు మూటగట్టుకుంటోంది. ఈ క్రమంలోనే వారికి జగన్ తీసుకున్న మూడు రాజధానులు నిర్ణయం వరంలా మారింది. జగన్ నిర్ణయంతో అమరావతి ప్రాంతంలో తప్ప మిగతా అన్నిచోట్ల మద్దతు లభించడంతో అమరావతి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యవహారాలు నడిపిస్తోందనే విమర్శలు వస్తున్నాయి. 


మూడు రాజధానులు వద్దు, అమరావతి ముద్దు అనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి తమ పార్టీ పలుకుబడి మరింత పెంచుకోవాలని టిడిపి భావిస్తోంది. తాజాగా ఇదే విషయమై మాజీ ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ కి జాతకాల పిచ్చి ఉందని, అందుకే రాజధానిని మార్చుతున్నారు అంటూ విమర్శించారు. విశాఖ శారదా పీఠం స్వామి స్వరూపానంద ఆలోచన, నిర్ణయంతోనే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు అంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జగన్ నిర్ణయం కారణంగా ఇటు హిందువులను అటు క్రైస్తవులను జగన్ మోసం చేస్తున్నారు అంటూ జవహార్ విమర్శలు చేశారు. జగన్ రాజధానిని విశాఖకు తరలించడం వెనుక ఖచ్చితంగా స్వరూపానంద సరస్వతి హస్తం ఉందని, ఆయన సందేహం వ్యక్తం చేశారు. 


జగన్ నిర్ణయం కారణంగా ఐదు కోట్ల మంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు అంటూ జవహార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో కొద్ది రోజుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో జగన్ భేటీ కాబోతున్నారని, హైదరాబాద్ కు మేలు చేసేలా మరో ఒప్పందం కుదుర్చుకునేందుకు కేసీఆర్ తో సమావేశం అవుతున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అధికార పార్టీ నాయకులు మీద ప్రజలు తిరుగుబాటు చేస్తే, దానికి తమ పార్టీ నాయకులపై ఆరోపణలు చేయడం సరికాదని ఆయన సూచించారు. మొత్తానికి టిడిపి నాయకుల వ్యవహారం చూస్తుంటే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జగన్ తన నిర్ణయం మార్చుకోరు అనే విషయం తెలిసినా ఏదో రకంగా ప్రజల్లో సానుభూతి సంపాదించాలనే విధంగా టిడిపి నాయకులు ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది అనే విమర్శలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: