ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అధికారులకు బిశ్వభూషణ్ తాను రాష్ట్రంలోని జిల్లాలలో పర్యటించే సమయంలో రెడ్ కార్పెట్ పలికే సాంప్రదాయాలను పాటించవద్దని సూచనలు చేశారు. రెడ్ కార్పెట్లు పలికే సాంప్రదాయానికి ముగింపు పలకాలని ఈ సాంప్రదాయం బ్రిటిష్ వలసపాలకుల నాటిదని బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. 
 
గవర్నర్ అధికారులకు ఇటీవల జరిగిన శ్రీశైలం పర్యటనలో ఈ విషయాన్ని తెలియజేశారని తెలుస్తోంది. గవర్నర్ అధికారులకు తన పర్యటనలో ఎక్కడా రెడ్ కార్పెట్ స్వాగత సాంప్రదాయాన్ని పాటించొద్దని రాజ్యాంగబద్ధంగా నిర్వహించాల్సిన కొన్ని అధికారిక కార్యక్రమాల్లో మాత్రమే రెడ్ కార్పెట్ సాంప్రదాయాన్ని పాటించాలని సూచనలు చేశారు. సాధారణంగా రాష్ట్ర ప్రథమ పౌరుడు కావడంతో గవర్నర్ కు రెడ్ కార్పెట్ ఘన స్వాగతం లభిస్తుంది. 
 
కానీ బిశ్వభూషణ్ హరిచందన్ మాత్రం ఈ సాంప్రదాయాన్ని తనకు పాటించవద్దని స్పష్టం చేశారు. తన పర్యటన సమయంలో అనవసర ఖర్చులు కూడా వద్దని గవర్నర్ అధికారులకు సూచించారని సమాచారం. గవర్నర్ హోదాలో ఉండి కూడా తనకు రెడ్ కార్పెట్ ఘన స్వాగతం అవసరం లేదని , తన పర్యటనకు అనవసర ఖర్చులు పెట్టవద్దని చెప్పటం పట్ల అధికారుల నుండి ప్రజల నుండి హర్షం వ్యక్తమవుతోంది. 
 
గతంలో కూడా అనేక సందర్భాల్లో గవర్నర్ బిశ్వభూషణ్ తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతంలో కూడా తిరుమలకు వెళ్లే సమయంలో సాధారణ విమానంలో ప్రయాణం చేశారు. అధికారులు ప్రత్యేక విమానం ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ గవర్నర్ మాత్రం సాధారణ విమానంలోనే ప్రయాణం చేస్తానని చెప్పారని సమాచారం. అంతేకాక రాజ్ భవన్ ప్రాంగణంలో తనకు బహుమతిగా వచ్చిన మొక్కలను గవర్నర్ నాటించారు. గవర్నర్ తీసుకుంటున్న నిర్ణయాలకు అధికారులు, ప్రజలు ఫిదా అవుతూ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గవర్నర్ తన నిర్ణయాలతో ఆదర్శంగా నిలుస్తున్నారని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: