తెలంగాణలో రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఆ నేత ఇప్పుడు తన నియోజకవర్గానికే పరిమితమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ఓటమితో అవమానంగా ఫీలవుతున్నఆయన...ఇప్పుడు ఎక్కడ పోగొట్టుకున్నామో...అక్కడే వెతకాలి అన్నట్టుగా మున్సిపల్ ఎన్నికల్లో తన సత్తా ఏంటో చూపాలనుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించని పరాభవానికి మున్సిపల్‌ ఎన్నికల్లో విజయం ద్వారా చెక్‌ పెట్టాలనుకుంటున్నారు. ఆ నేత ఎవరో కాదు తెలంగాణ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.  మరి లోకల్‌ వార్‌లో ఉత్తమ్‌ తిరిగి తన నియోజకవర్గంలో పట్టు సాధిస్తారా..?

 

హజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సతీమణి పద్మావతి.. ఘోరంగా ఓడారు. ఆ ఓటమిని పరాభవంగా భావిస్తున్నారు ఉత్తమ్‌. ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కి అంత మెజార్టీ వస్తుందని కాంగ్రెస్‌ నాయకులెవరూ ఊహించలేదు. కారణం ఉత్తమ్‌కు తన నియోజక వర్గంలో బలమైన క్యాడర్‌ ఉంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారనే టాక్‌ కూడా ఉంది. మొత్తానికి హుజూర్ నగర్ ఉపఎన్నికల్లో  ఊహించని ఫలితాలు రావటంతో అవమానంగా ఫీలయ్యారు ఉత్తమ్‌. పీసీసీ చీఫ్‌గా ఉంటూ సొంత నియోజకవర్గంలోనే... ఊహించని ఓటమి ఎదురవ్వడంతో రాజకీయంగా కొంత ఇబ్బంది ఎదుర్కున్నారు.

 

ఉపఎన్నికల ఓటమి నుంచి బయట పడటానికి మున్సిపల్‌ ఎన్నికలను వాడుకోవాలనుకుంటున్నారు ఉత్తమ్‌. ఎక్కడైతే ఓటమితో పరువు పొగొట్టుకున్నారో.. అక్కడే గెలిచి సత్తా చాటాలని ఉత్తమ్‌ భావిస్తున్నారు. మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్‌ వచ్చినప్పటి నుంచి ఆయన తన సొంత నియోజకవర్గం హుజూర్‌నగర్‌లో పాగా వేశారు. హుజూర్‌ నగర్‌తో పాటు నల్గొండ పార్లమెంట్‌లోని అన్ని నియోజకవర్గాల్లో లోకల్‌ ప్రచారాన్ని మొదలుపెట్టారు ఉత్తమ్‌. ప్రతి నియోజకవర్గంలో తిరుగుతూ పార్టీ కేడర్‌లో ఆత్మస్థైర్యాన్ని నింపే పనిలో పడ్డారు ఉత్తమ్‌. 

 

పార్లమెంట్ నియోజకవర్గం కంటే...హుజూర్ నగర్‌నే కీలకంగా తీసుకుంటున్నారు ఉత్తమ్‌. హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ఇప్పుడు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. హుజూర్‌నగర్‌ పట్టణం కాంగ్రెస్‌కు కంచుకోటలాంటిది. కానీ ఉపఎన్నికల ఫలితాల్లో టీఆర్‌ఎస్‌ మార్క్‌ కనిపించింది. ఎక్కువ ఓట్లు గులాబీ పార్టీకే పోలయ్యాయి. దీంతో మున్సిపల్‌ ఎన్నికల్లో తిరిగి పట్టు సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు. రెండు మున్సిపాలిటీల్లో గెలిచి.. కాంగ్రెస్‌ జెండా తిరిగి ఎగుర వేయాలని తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కోవాలనే సామెతను ఉత్తమ్ ఇప్పుడు బాగా ఫాలో అవుతున్నారు. ఉత్తమ్‌ ప్రయత్నాలు ఎంత వరకు పనిచేస్తాయో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: