ఆ ఇద్దరు రాజకీయ ఉద్దండులు.. ఆయా పార్టీల్లో కీలక నేతలు. ఒకరంటే మరొకరికి గిట్టదు. అయినా ఒకరు మంత్రి కాగానే మరొకరు పిలిచి సన్మానం చేసి.. అంతా శాంతం అన్నట్లు సీన్ చూపించారు. మళ్లీ మున్సిపోల్స్ వచ్చేసరికి.. సై అంటే సై అంటున్నారు. అంతేనా జిల్లాలో పైచేయికి ప్లాన్స్ వేస్తుండడంతో..రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. మెదక్ జిల్లాలో పాలిటిక్స్ హాట్ హాట్ గా మారాయి. 

 

హరీష్ రావు. జగ్గారెడ్డి..  ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నేతలే. అనుకుంటే ఏదైనా సాధించే సత్తా ఉన్న నాయకులు. ఒకరు అధికార పార్టీ నాయకులు...మరొకరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే. జనంని మెప్పించటం ఎలాగో ఇద్దరికీ తెలుసు. అయితే జిల్లాలో ఉన్న మున్పిపాలిటీలన్నింటినీ గెలిచి తీరాలని ఇద్దరూ పంతంతోనే ఉన్నారు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమన్న పరిస్థితి ఉన్నప్పటికీ.. మంత్రి అయ్యాక హరీష్ ను పిలిచి సన్మానం చేశారు జగ్గారెడ్డి. అభివృద్ధికి సహకరించాలని కోరారు.  
కొద్ది రోజులు బాగానే ఉన్నారు కానీ.. ఇంతలో ఏమైందో కానీ మళ్లీ గ్యాప్ వచ్చేసింది. నువ్వా నేనా అని తేల్చుకోవాలని డిసైడ్ అయ్యారు. హరీష్ ఉద్దేశ పూర్వకంగానే తనను పక్కన పెడుతున్నారని... జగ్గారెడ్డి మళ్లీ తన పాత పంథానే ఎంచుకున్నారు. మంత్రి హరీష్ ని టార్గెట్ చేస్తూనే... కేటీఆర్ ని అభినందిస్తున్నారు.  వ్యవహారం... సంగారెడ్డి లో హరీష్ కు సవాల్ విసిరే వరకు వెళ్లింది. జిల్లాలో మున్సిపాలిటీలన్నింటిపై కాంగ్రెస్ జెండా ఎగిరేయిస్తా అని జగ్గారెడ్డి సవాల్ చేస్తే... కాంగ్రెస్ అయ్యేది లేదు పోయేది లేదు. టీఆర్ఎస్ దే విజయం అంటు ధీమా వ్యక్తం చేశారు హరీష్. 

 

సంగారెడ్డి జిల్లాలో మొత్తం 8 మున్సిపాలిటీలు ఉన్నాయి.  జహీరాబాద్ మున్సిపాలిటీ వ్యవహారం కోర్టులో ఉండటంతో ఇక్కడ ఎన్నికలు జరగటం లేదు. దీంతో ఏడు మున్సిపాలిటీ ఎన్నికలు జగ్గారెడ్డికి, హరీష్‌కు సవాల్ గా మారాయి. సంగారెడ్డి నియోజకవర్గం నుంచి జగ్గారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా..జగ్గారెడ్డి సతీమణి నిర్మల.. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షురాలిగా ఉన్నారు. దీంతో జిల్లాలోని అన్ని మున్సిపాలీటీల బాద్యత కూడా జగ్గారెడ్డినే చూసుకుంటున్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సంగారెడ్డి మున్పిపాలిటీలో ఛైర్మన్ అభ్యర్ధిగా నిర్మల పేరును ప్రకటించారు జగ్గారెడ్డి. రిజర్వేషన్ కూడా బీసీ మహిళకు కావటంతో తాను అనుకున్నదానికి లైన్ క్లియర్ అయ్యింది. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని నిలవరించటానికి టీఆర్ఎస్ ..ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో సంగారెడ్డి మున్సిపల్ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. సతీమణిని గెలిపించుకోవటానికి జగ్గారెడ్డి,, జగ్గారెడ్డిని నిలవరించటానికి  హరీష్.. ఇప్పటికే వ్యూహా ప్రతివ్యూహాలు చేస్తున్నారు. ఇక  సంగారెడ్డి నియెజకవర్గంలోని సదాశివపేట మున్సిపాలిటీ.. మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ సొంతూరు కావటంతో... టీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే చింత ప్రభాకర్ సొంతూరుకు చేసిందేంటి..? అనే చర్చను జగ్గారెడ్డి లేవనెత్తున్నారు. మంజీరా నీళ్లు రాకపోవటంతో తాగు నీటి కట కటకు కారణం హరీష్, చింతా ప్రభాకరే అంటూ జగ్గారెడ్డి ఎటాక్ చేస్తున్నారు. అయితే కాళేశ్వరం నీళ్లు సంగారెడ్డి వరకు వస్తున్నాయని టీఆర్ఎస్ కౌంటర్ ఇస్తోంది.

 

నారాయణఖేడ్, ఆందోల్, తెల్లాపూర్, అమీన్ పూర్, బోల్లారం మున్పిపాలిటీల్లో రాజకీయంగా అంత ప్రాధాన్యత లేదు. నారాయణ ఖేడ్ నియోజకవర్గంలో ఉంది ఒకటే మున్సిపాలిటీ కావటంతో .. ఇరు పార్టీల నాయకులు స్థానిక నాయకత్వానికి బాధ్యతలు అప్పగించారు. ఆందోళ్, పటాన్ చెరు నియోజకవర్గంలోని తెల్లాపూర్, అమీన్ పూర్, బొల్లారం మున్పిపాలిటీల్లో గెలుపుకోసం .. జగ్గారెడ్డి, హరీష్  ప్రయత్నాలు ముమ్మరం చేశారు.  పాత జిల్లా అంతా తన ప్రభావం ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా ప్రచారం చేయాలని జగ్గారెడ్డి ప్లాన్ వేస్తున్నారు. అటు సిద్దిపేట జిల్లాలో కూడా మున్పిల్ ఎన్నికల ప్రచారంకు వెళ్తానంటున్నారు. ఎన్నికల్లో ఇప్పటి వరకు టీఆర్ఎస్ హావానే కొనసాగుతూ వస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితి ఉండదంటోంది కాంగ్రెస్. మొత్తానికి రెండు పార్టీలు కాన్ఫిడెన్స్ తోనే ఉన్నాయి. టీఆర్ఎస్ ప్రభావాన్ని కొంతైనా తగ్డించి పంతం నెగ్గించుకోవాలని జగ్గారెడ్డి చూస్తున్నారు. తన హవాని కొనసాగించి సత్తా చాటాలని హరీష్ ప్లాన్ వర్కవుట్ చేసుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: