మనలో చాలామంది బైక్ నడిపే సమయంలో సమయంలో హెల్మెట్ ను వినియోగిస్తున్నారు. కానీ బైక్ పై వెనుక కూర్చున్న వాళ్లు మాత్రం ధరించటం లేదు. వెనుక కూర్చున్న వాళ్లకు హెల్మెట్ అవసరమా...? అని చాలామంది అనుమానం వ్యక్తం చేయవచ్చు. కానీ బైక్ పై వెనుక సీటులో ప్రయాణించేవారు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. హైదరాబాద్ పోలీసులు బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ ఉండాల్సిందే అని చెబుతున్నారు. 
 
ఉప్పల్ ట్రాఫిక్ ఏసీపీ ఎల్.ఎన్. రాజు బైక్ నడిపే వ్యక్తితో పాటు వెనుక కూర్చున్న వ్యక్తికి కూడా హెల్మెట్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఎల్.ఎన్.రాజు మాట్లాడుతూ బైక్ పై ఇద్దరు వ్యక్తులు ప్రయాణించే సమయంలో బైక్ నడిపే వ్యక్తి మాత్రమే హెల్మెట్ ధరించి వెనుక సీటులో ఉండే వ్యక్తి హెల్మెట్ ధరించని పక్షంలో నిబంధనల ప్రకారం జరిమానా చెల్లించాలని సూచనలు చేశారు. ఏసీపీ రాజు వాహనదారులకు ఉప్పల్ క్రాస్ రోడ్డులో హెల్మెట్ నిబంధనల గురించి అవగాహన కల్పించారు. 
 
ఏసీపీ రాజు గత సంవత్సరం రాచకొండ కమిషనరేట్ పరిధిలో 750మంది యాక్సిడెంట్లలో చనిపోయారని చనిపోయిన 750 మందిలో 26 మంది వెనుక సీటులో కూర్చున్నవారేనని చెప్పారు. మోటార్ వెహికిల్ యాక్ట్ 129 ప్రకారం రెండు చక్రాల వాహననాలపై ప్రయాణించే ఇద్దరికీ హెల్మెట్ లేని పక్షంలో 100 రూపాయల జరిమానా విధిస్తామని అన్నారు. ఇప్పటికే కొన్ని నగరాల్లో ఈ నిబంధన అమలులో ఉంది. 
 
బెంగళూరు, ఢిల్లీ, ముంబై లాంటి నగరాలలో ఇప్పటికే ద్విచక్ర వాహనంపై వెనుక సీటులో కూర్చునే వ్యక్తి హెల్మెట్ ధరించాలనే నిబంధన అమలులో ఉంది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు మోటారు వాహనాల చట్టంలో ఈ నిబంధన ఉన్నప్పటికీ ఇంతకాలం తప్పనిసరి చేయలేదు. కానీ రోజురోజుకు ప్రమాదాల సంఖ్య పెరుగుతూ ఉండటంతో వెనుక సీటులో ఉండే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలనే నిబంధనపై దృష్టి పెట్టారు. త్వరలో హైదరాబాద్ నగరమంతా అధికారికంగా ఈ నిబంధన అమలులోకి వచ్చే అవకాశం ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: