తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలను ఎదుర్కొనేందుకు తమ బలం బలం సరిపోదని ముందుగానే గ్రహించిన కాంగ్రెస్ పార్టీ పొత్తులతో స్థానిక సంస్థల ఎన్నికల్లో గట్టెక్కాలని చూస్తోంది. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జీ కుంతియా, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క  సిపిఐ, సిపిఎం, టిడిపి ముఖ్య నాయకులకు ఫోన్ చేశారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తో ఫోన్లో మాట్లాడి మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనికి సమాధానంగా ఇప్పటికే రాష్ట్ర కార్యవర్గం స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అధికారం మండల కమిటీలు, జిల్లా కమిటీలకు అప్పగించింది చెప్పారు.


 ఎవరితో కలిసి పని చేస్తే మెరుగైన ఫలితాలు వస్తాయో సరిచూసుకుని అప్పుడు పొత్తుల గురించి ఆలోచిస్తామని ప్రకటించింది. దీంతో ఎక్కడికక్కడ పొత్తు ప్రతిపాదనలను స్థానికంగా మాట్లాడి తీసుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇప్పటికే ఖమ్మంలో సిపిఐ, టిఆర్ఎస్ మధ్య కొంత అవగాహన కుదిరింది. స్థానిక పరిస్థితులకు అనుగుణంగా చేసుకోబోతున్నారు. సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతో కూడా కాంగ్రెస్ నాయకులు ఫోన్లో మాట్లాడారు. టిఆర్ఎస్, బిజెపిలకు వ్యతిరేకంగా తాము పని చేయాలని నిర్ణయం తీసుకున్నాము కాబట్టి స్థానిక నాయకులతో మాట్లాడి తర్వాత పొత్తు ఖరారు చేసుకోవచ్చు అంటూ ఆ పార్టీ ప్రకటించింది. 


టిడిపి తెలంగాణ అధ్యక్షుడు రమణ తో కూడా కాంగ్రెస్ నాయకులు మాట్లాడారు. టిడిపి బలంగా ఉన్న చోట్ల స్వతంత్రంగా నిలబడాలని తమ పార్టీ నిర్ణయించిందని, బలం లేని చోట్ల అవసరాన్ని బట్టి అవగాహన చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ఆ పార్టీ ప్రకటించింది. మొత్తంగా చూస్తే అధికార టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న బీజేపీని ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా అర్ధం అవుతోంది. వాస్తవంగా మున్సిపల్ ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీకి భయం భయంగానే ఉంది. అందుకే ఎన్నికల నోటిఫికేషన్ ను వాయిదా వేయించాలంటూ కోర్ట్ లో పిటిషన్ వేసినా అక్కడ ఎదురు దెబ్బ తగలడంతో ఇప్పుడు ఈ విధంగా పొత్తులతో గట్టెక్కాలని చూస్తున్నట్టుగా కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: