రాజధానిని ముక్కలుచేసి, ప్రజలతో  మూడుముక్కలాడ ఆడుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి, 22రోజులుగా ఆందోళన చేస్తున్న రైతుల మానసికస్థితిని చంపించడా నికి ప్రయత్నిస్తున్నాడని టీడీపీ అధికారప్రతినిధి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న ఆక్షేపించారు.  రైతుల దీక్షలు, వారి ఆందోళనలను వినలేని వ్యక్తి, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండటం ఆంధ్రుల దౌర్భాగ్యమని, ఆయనకళ్లు, చెవులు పనిచేయడంలేదేమోనన్న ఆనుమానంతో కళ్లద్దాలు, వినికిడియంత్రం కానుకగా పంపుతున్నామని వెంకన్న  స్పష్టం చేశారు. రైతుల ఆందోళనలు పట్టించుకోకుండా, మహిళలని కూడా చూడకుండా పోలీస్‌ యంత్రాంగంతో ఉద్యమాలను అడ్డుకోవాలని చూడటం ప్రభుత్వానికి తగదన్నా రు. 

 

డీజీపీ గౌతమ్‌సవాంగ్‌, గతంలో విజయవాడ పోలీస్‌కమిషనర్‌గా పనిచేశారని, ఆనాడున్న ప్రభుత్వం ఎప్పుడూ, ఎవరిపై తప్పుడుకేసులు పెట్టించలేదన్న విషయాన్ని   ఆయనే స్పష్టంచేయాలన్నారు. జగన్‌ ఏంచెబితే అదిచేయడం, అన్యాయంగా అరెస్ట్‌లు చేయడం, తప్పుడుకేసులు పెట్టడం డీజీపీకి తగదన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి డీజీపీనో.. సవాంగ్‌ డీజీపీనో...తెలియడంలేదన్నారు. అతిముఖ్యమైన శాంతిభద్రతల అంశంతో ఆటలాడటం డీజీపీకి తగదని, తప్పుడుకేసులు పెట్టేముందు ఒకసారి ఆలోచిం చుకోవాలని వెంకన్న హితవుపలికారు. జగన్మోహన్‌రెడ్డి తానా అంటే... డీజీపీ తందానా.. అంటున్నాడని, ముఖ్యమంత్రి చెప్పింది చేయడం సవాంగ్‌కి తగదన్నా డు. 

 

రాజధానిలో  ప్రతిపక్షనేత చంద్రబాబుపై జరిగిన దాడిని సమర్థించిన డీజీపీ, వైసీపీఎమ్మెల్యే పిన్నెల్లి విషయంలో ఎందుకంత అత్యుత్సాహం చూపుతున్నారని బుద్దా ప్రశ్నించారు. మేంతలుచుకుంటే టీడీపీవాళ్లెవరూ రోడ్లపై తిరగరని ఒక మంత్రి మాట్లాడుతున్నాడని, టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రజలరక్షకులే తప్ప, భక్షకులు కాదనే విషయాన్ని సదరు మంత్రి గ్రహించాలన్నారు. ప్రజలకోసం, వారితరుపున పోరాడటానికే టీడీపీనేతలుగా తామందరం రోడ్లపైకి వస్తున్నామనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు.

 

రాష్ట్రచరిత్రలో ఎన్నడూలేనివిధంగా ఒకప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు వచ్చిందని,  దాన్ని అణచివేయాలని చూస్తే, జగన్‌ ప్రభుత్వం పతనమవడం ఖాయమని వెంకన్న తీవ్రస్వరంతో హెచ్చరించారు. వైసీపీఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నమస్కారం పెడుతూ, తమసమస్యను వినాలని ఒకరైతు వేడుకుంటుంటే, ఆయన గన్‌మెన్‌ ఆరైతుని తోసేశాడన్నారు. రైతులు శాంతియుతంగా ధర్నాలు చేస్తుంటే, వారిని రెచ్చగొట్టడానికి అధికారపార్టీనేతలు ప్రయత్నిస్తున్నారన్నారు.    

మరింత సమాచారం తెలుసుకోండి: