ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలోనే ఉండాలని రైతుల ఆందోళన కొనసాగుతోంది. పోలీసులు టెంట్ లు వేయడానికి అనుమతి ఇవ్వకపోయినా.. ఎండలోనే ధర్నాలు జరుగుతున్నాయి. అటు జనసేన కూడా రైతులకు మద్దతు పలికింది. పోలీసులు అరెస్ట్ చేసిన రైతుల్ని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు.

 

రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ రైతుల ఆందోళనలు 22వ రోజు నిరసన తెలిపారు. మందడంలో రైతులు టెంట్‌ వేసేందుకు యత్నించగా పోలీసులు అనుమతించలేదు. దీంతో రైతులు, వృద్ధులు, మహిళలు రహదారిపైనే భైఠాయించి ధర్నా చేశారు. ఎండలోనే దీక్ష కొనసాగించడంతో ఇద్దరు రైతులు సొమ్మసిల్లి పడిపోయారు. అస్వస్థతకు గురైన రైతులకు వైద్యులు చికిత్స అందించారు. అమరావతి కోసం ఎండను సైతం లెక్కచేయకుండా దీక్ష చేస్తామని రైతులు చెబుతున్నారు. వెలగపూడి, కృష్ణాయపాలెంలోనూ రైతుల దీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఈ సందర్భంగా రైతులు నినాదాలు చేశారు. మందడం, వెలగపూడి గ్రామాల్లో పోలీసులు భారీగా మోహరించారు. సీఎం సచివాలయానికి వెళ్లే మార్గంలో పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు.

 

రాజధాని ఆందోళనల్లో అరెస్టైన రైతులను పరామర్శించారు నారా లోకేష్‌. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఒకే రైతుపై 9కేసులు పెట్టారని ఆరోపించారు లోకేష్‌. నిరసనలు చేస్తున్న 16మంది రైతులను అరెస్ట్ చేశారని మండిపడ్డారు. గుంటూరు, కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలే, ఎమ్మెల్సీలు రైతులను కించపరుస్తున్నారంటూ విమర్శించారు లోకేష్‌. వైసీపీ ఎమ్మెల్యేలు కావాలనే రైతులు ఆందోళన చేస్తున్న చోటుకు వచ్చారన్న లోకేష్‌.. కారుమీద రాయిపడితే కేసులు పెడుతున్నారంటూ ఫైర్‌ అయ్యారు.

 

అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ జనసేన పార్టీ నిరసన దీక్షలు చేపట్టింది. పార్టీ కార్యాలయం వద్ద రైతులకు సంఘీభావంగా జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ దీక్షకు దిగారు. ఈ నిరసనలో నాదెండ్ల మనోహర్‌ అమరావతి జేఏసీ నాయకులు పాల్గొన్నారు. మొత్తానికి అమరావతి రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గడంలేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: