అయ్యో పాపం ! చంద్రబాబుకి ఎంత కష్టం వచ్చింది ? హాయిగా మనవడితో ఇంట్లో ఆడుతూ, ఆటాడిస్తూ ఇంట్లో విశ్రాంతి తీసుకోవాల్సిన వయస్సులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రోడ్డు మీద పడ్డాడు. పోరాటాలు, ఉద్యమాలు అంటూ హడావుడి చేస్తున్నాడు. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని పదే పదే చెబుతున్నా పోలీసులు పట్టించుకోకుండా డబ్బా బండిలో కుక్కి స్టేషన్కి తరలిస్తున్నారు. ఆయన సీనియారిటీ కి కూడా ఇప్పుడు గౌరవం దక్కడం లేదు. సాధారణంగా అందరు తనను బాగా చాలా బాగా గౌరవించాలని, ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ చంద్రబాబు కోరుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఆ గౌరవం సొంత పార్టీ నాయకుల నుంచి కూడా ఆయనకు దక్కడం లేదు.


 ఏడు పదుల వయసు లో ప్రత్యక్ష రాజకీయాలకు స్వస్తి చెప్పి తన కుమారుడిని ముందు పెట్టి రాజకీయం నడిపించాల్సిన చంద్రబాబు రోడ్డు మీద పడి ఉనికి కోసం పోరాడుతున్నాడు. దీనికి ప్రత్యక్షంగాను, పరోక్షంగానూ ఆయన కుమారుడు నారా లోకేష్ కారణం అని అందరికీ ఎప్పుడో అర్థం అయింది. ఇప్పటికే పార్టీలోని చాలామంది కీలక నాయకులు పార్టీకి గుడ్ బై చెప్పారు. తాము వెళ్లి పోవడానికి ప్రధాన కారణం చినబాబు, లోకేష్ కారణం అని, ఆయన ఆధ్వర్యంలో పార్టీ మునిగిపోయే నావ అని, ఇలా ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేసి లోకేష్ పరువును కాస్తా బజారున పడేసారు. ఈ పరిస్థితుల్లో ఏపీలో రాజుకున్న రాజధాని చిచ్చు వ్యవహారాన్ని తాను డీల్ చేయకుండా తన కుమారుడి చేతిలో పెట్టి ఉంటే ఈ పాటికి ఉద్యమం చల్లారి పోవడమే కాకుండా తిరిగి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు వచ్చేలా చేయగల సమర్ధుడు లోకేష్ అనే విషయం బాబుకు ముందుగానే అర్థమైపోయింది.


 అందుకే తన వయస్సు సహకరించకపోయినా, ప్రజా ఉద్యమాల్లో తాను ముందుకు వెళుతూ, పార్టీ నాయకులను వెంట తీసుకు వెళ్తున్నాడు. అప్పుడప్పుడు మాత్రమే రైతుల పరామర్శ పేరుతో లోకేష్ పర్యటనలు చేస్తున్నారు తప్ప ఉద్యమంలో లోకేష్ పాత్ర అంతంతమాత్రంగానే ఉంది. ఈ పోరాటంలో ఏమాత్రం సఫలం కాకపోయినా, రాజకీయంగా, ఆర్థికంగా సొంత సామాజిక వర్గం నుంచి విమర్శలు ఎదుర్కోవాలి. ఇలా అనేక రకాలుగా టిడిపి వెనుకబడి పోతుంది అనేది బాబు బాధ. అందుకే ఏడు పదుల వయస్సులో కూడా చంద్రబాబు యువకుడిలా, తన కొడుకు వయసు ఉన్న సీఎం జగన్ తో నిత్యం పోరాడుతున్నాడు. 


లోకేష్ కు ఇంకా రాజకీయ పరిజ్ఞానం, ఎత్తులు పైఎత్తులు వేయడంలో ప్రాథమిక దశలోనే ఉన్నారనే భావన చంద్రబాబులో ఎక్కువగా ఉంది. అందుకే పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇలా ఎండనకా వాననకా తిరుగుతూ తన కొడుకు అసమర్ధతను తిట్టుకుంటూనే చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా జనాలు అనుమానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: