సినిమాల్లో రాములమ్మ విజయశాంతి ఫెరఫామెన్స్ ఏ విధంగా ఉంటుందో చెప్పనవసరం లేదు. హీరోలకు ధీటుగా ఆమె నటిస్తూ లేడీ అమితాబ్ బచ్చన్ గా పేరు సంపాదించుకున్నారు. ఆ తరువాత రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అడుగుపెట్టిన ఆమెకు మొదటి నుంచి అవి కలిసిరావడంలేదు.మొదట్లో బీజేపీలో చేరిన విజయశాంతి చాలా కాలం పాటు ఆ పార్టీలోనే ఉన్నారు. కానీ బిజెపి అప్పట్లో అధికారానికి దూరంగా ఉండడం, తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో ఆమె టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆ పార్టీలో ఆమె కేసీఆర్ కు అత్యంత సన్నిహితురాలిగా మంచి ప్రాధాన్యం దక్కించుకున్నారు. ఆ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పారు. ఆ తర్వాత కెసిఆర్ తో విభేదాలు రావడంతో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.


 మొదట్లో అక్కడ సరైన ప్రాధాన్యం దక్కినా ఆ తరువాత తరువాత కాంగ్రెస్ పార్టీ ఆమెకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గించింది. అది కాకుండా అటు కేంద్రంలోనూ, ఇటు రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ రోజురోజుకు బలహీనపడుతున్న క్రమంలో ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. గత తెలంగాణ ఎన్నికల్లో ప్రచార కమిటీ చైర్మన్ గా ఉన్న ఆమె ఎన్నికల్లో పదునైన మాటలతో ప్రత్యర్థుల మీద విరుచుకుపడుతూ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రయత్నించారు. కానీ ఆ పార్టీ ఘోరంగా విఫలం అవ్వడం, ఇప్పుడు తెలంగాణలో ఉనికి కోల్పోయే పరిస్థితి వస్తుండడంతో ఆమె పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 


మళ్లీ సినిమాల్లోకి దాదాపు పదమూడేళ్ళ తరవాత రీ ఎంట్రీ ఇచ్చారు. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ప్రొఫెసర్ పాత్రలో విజయశాంతి నటించారు. ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమా అవకాశాలు ఆమెకు వస్తుండడంతో పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుని సినిమాలవైపు దృష్టి పెట్టాలని ఆమె భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అదీ కాకుండా కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటీ సమావేశాలకు ఆమెను ఆహ్వానించక పోవడం, మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రావాల్సిందిగా ఇప్పటి వరకు పార్టీ నుంచి ఎటువంటి ఆహ్వానం అందకపోవడంతో కాంగ్రెస్ పార్టీపై ఆమె గుర్రుగా ఉన్నారు. అందుకే తనకు మొదటి నుంచి రాజకీయాలు కలిసి రావడం లేదనే భావంతో పూర్తి స్థాయిలో సినిమాల మీద దృష్టి పెట్టాలని చూస్తున్నట్టుగా ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: