ఏపీలో బలం పుంజుకోవడంతో పాడు వచ్చే ఎన్నికల నాటికి బలమైన పార్టీగా అవతరించాలని చూస్తున్న బీజేపీ అందుకు తగ్గట్టుగా ఇప్పటి నుంచే పార్టీలో మార్పుచేర్పులు చేసుకుంటోంది. ఇతర పార్టీల్లో ఉన్న బలమైన నాయకులను చేర్చుకుని గ్రామ స్థాయిలో పార్టీని తీసుకువెళ్లాలని చూస్తోంది. అవసరమైతే సొంతంగా కానీ లేక మరేదైనా పార్టీని విలీనం చేసుకుని ఏపీలో తన హవా చూపించాలనే ఆలోచనలో ఉంది. ఈ పరిస్థితుల్లో ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణ పదవీకాలం ముగుస్తున్న నేపథ్యంలో, ఈ నెలాఖరులోపు ఏపీ బిజెపికి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు కసరత్తు మొదలుపెట్టింది.


 ఇటీవల విజయవాడలో జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో కొత్త అధ్యక్షుడు ఎంపిక పై తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి దృష్టి పెట్టింది. ఈ ఎన్నికల్లో పార్టీ కొంత వరకు పట్టు సాధిస్తే, 2024 సాధారణ ఎన్నికల్లో  ప్రత్యర్థి పార్టీలకు గట్టిపోటీ ఇవ్వొచ్చనే ఆలోచనతో బీజేపీ ఉంది. బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా కూడా ఏపీ బీజేపీ పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. సమర్ధుడైన నాయకుడుని అధ్యక్షుడిగా నియమించడం వల్ల ముందు ముందు పార్టీని మరింతగా జనాల్లోకి తీసుకువెళ్లాలి అనే అభిప్రాయంతో ఉన్నారు.


ప్రస్తుతం ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారిలో కన్నా లక్ష్మీనారాయణతో పాటు, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందరేశ్వరి, మాజీ దేవాదాయ శాఖ మంత్రి పైడి కొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ మాధవ్ సోము వీర్రాజు ఉన్నారు. వీరంతా బిజెపిలో ప్రాధాన్యం ఉన్న చురుకైన నాయకులుగా గుర్తింపు పొందారు. వీరు కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీలో చేరిన మాజీ కేంద్రమంత్రి ఎంపీ సుజనా చౌదరి కూడా అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నట్టు సమాచారం. అయితే అధిష్టానం మాత్రం కన్నా లక్ష్మీనారాయణ, పురంధరేశ్వరి, సోము వీర్రాజు లను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.


 బిజెపి జాతీయ మహిళా మోర్చా అధ్యక్షురాలుగా ఉన్న పురందరేశ్వరి ఏపీ అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నట్టు ఆమె సన్నిహితుల ద్వారా తెలుస్తుంది. అయితే అధిష్టానం వీరిలో ఎవరైతే పార్టీని ముందుకు తీసుకువెళ్లగలరో లెక్కలు వేసుకుని కొత్త రథసారధిని నియమించే అవకాశం ఉంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: