తెలంగాణలో జనసేన పార్టీకి బలం లేదని, అసలు ఉనికే లేదనే విషయం అందరికీ తెలుసు. అయితే ఆ విషయాన్ని ధైర్యంగా ఒప్పుకునేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇష్టపడడం లేదు. కానీ తమకు ఎన్నికల్లో పోటీ చేయడం అంటే భయం అనే విషయాన్ని రకరకాల మార్గాల ద్వారా పవన్ వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో తాము పోటీ చేయడంలేదని జనసేన పార్టీ అధికారికంగా  ప్రకటించింది. కానీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆసక్తి ఉన్నవారు మాత్రం ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని ప్రకటించారు. పార్టీ తరఫున పార్టీ సింబల్ వాడుకోకుండా పోటీ చేసిన తరువాత వారికి ఏ విధంగా మద్దతు ఇస్తారు అనే దానిపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి.


 గతంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ జనసేన పార్టీ ఇదే విధమైన వైఖరిని కనబరిచింది. అకస్మాత్తుగా ముందస్తు ఎన్నికలు వచ్చాయి కాబట్టి తాము పోటీ చేయడం లేదంటూ ప్రకటించింది. అలాగే రెండు రాష్ట్రాల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా జనసేన దూరంగా జరిగింది. కేవలం పోటీ చేసింది ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రమే. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కొంత మంది అభ్యర్థులను రంగంలోకి దించినా వారు ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. 


ఇప్పుడు తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను నిలబెట్టినా వారు గట్టెక్కే అవకాశం లేదన్న విషయం పవన్ కు బాగా తెలుసు. అందుకే పార్టీ తరఫున అభ్యర్థులను దింపకుండా ఇండిపెండెంట్ గా ఎవరైనా పోటీచేసి గెలిస్తే వారిని పార్టీ అభ్యర్థులు గా ప్రకటించి ఓడిన వారు తమకు సంబంధం లేదన్నట్లుగా మాట్లాడవచ్చని పవన్ భావిస్తున్నట్టుగా అర్థమవుతోంది.ఈ విధంగా రాజకీయ వ్యవహారాలు నడిపించడం వల్లే పార్టీపై ఉన్న నమ్మకం జనసేన కార్యకర్తల్లో సైతం తగ్గుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో పవన్ తన నిర్ణయాన్ని ఏ విధంగా ప్రకటిస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: