రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరి పేరు కొద్ది రోజులుగా అమరావతి ఆందోళన కార్యక్రమాల్లో పెద్ద ఎత్తున వినిపిస్తోంది. జగన్ తీసుకున్న మూడు రాజధానుల విషయంలో అందరికంటే ఎక్కువగా సుజనా చౌదరి తన కోపాన్ని, భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ పార్టీ బిజెపి నిర్ణయం ఏమిటి అనేది స్పష్టంగా తెలియనప్పటికీ సుజనా మాత్రం తన మాటే బీజేపీ అధిష్టానం మాట అన్నట్టుగా ఈ వ్యవహారంలో స్పీడ్ పెంచారు. అమరావతి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున బినామీ పేర్లతో భూములు ఉన్నాయని అందుకే అందరికంటే ఎక్కువగా ఆయన బాధ పడుతున్నారనే విమర్శలు వస్తున్నా వాటిని ఏమాత్రం లెక్క చేయడం లేదు. 


రాజధాని అమరావతి ప్రాంతం నుంచి తరలిస్తే కేంద్రం చూస్తూ ఊరుకోదు అంటూ మొదట్లో గట్టిగానే హెచ్చరికలు చేశారు సుజనా. ఆ తరువాత ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా స్పందించారు. ఓ గంటపాటు మౌనదీక్ష కూడా చేశారు. ఇదంతా సుజనా చౌదరి ప్రోద్బలంతోనే కన్నా అమరావతికి మద్దతు ఇచ్చారనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి. ఇప్పుడు రాజధాని వ్యవహారం మరింతగా ఉధృతమైంది. టిడిపి అధినేత చంద్రబాబును ఏపీ ప్రభుత్వం అరెస్టు కూడా చేసింది. అయితే అనూహ్యంగా సుజనా చౌదరి ఈ వ్యవహారంలో ఎక్కడా కనిపించడం లేదు. కనీసం రాజధానిపై ఎటువంటి ప్రకటనలు చేయకుండా పూర్తిగా సైలెంట్ అయిపోయారు.


 ఆయన సైలెంట్ అవ్వడం వెనుక బీజేపీ అధిష్టానం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో మీరు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారు అంటూ  ఆయనపై బీజేపీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కారణం అని తెలుస్తోంది. అమరావతి వ్యవహారం పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిందని, దీంట్లో పార్టీ అనుమతి లేకుండా అతిగా స్పందించ వద్దంటూ సుజనా కు వార్నింగ్ ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రాల విషయంలో కేంద్రం మితిమీరిన జోక్యం చేసుకుంటుందని, బిజెపి నిందలు మీద వేసుకుంటోంది.


 ఈ నేపథ్యంలో ఏపీ రాజధాని విషయంలోనూ జోక్యం చేసుకుంటే తమ పార్టీకి మరింత చెడ్డపేరు వస్తుందనే ఉద్దేశంతో సుజనా చౌదరి కి గట్టిగా వార్నింగ్ ఇవ్వడంతో, ఆయన ఈ వ్యవహారం నుంచి పక్కకు తప్పు ఉన్నట్టుగా అర్ధం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: