తొందరలో జరగబోయే స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయబోయే అభ్యర్ధుల విషయంలో జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. సర్పంచు, ఎంపిటిసి, జడ్పిటిసి స్ధానాలకు పోటి చేసే అభ్యర్ధులకు విద్యార్హత నిబంధన పెట్టాలని డిసైడ్    అయ్యారట.  విషయంపై  సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

 

ఎంపిటిసి స్ధానాలకు పోటి చేసే అభ్యర్ధుల కనీస విద్యార్హత ఇంటర్మీడియట్ గా నిర్ణయించబోతున్నారట. జడ్పిటిసి, మండల పరిషత్ ప్రెసిడెంట్ (ఎంపిపి) పోస్టులకు డిగ్రి,  గ్రామ సర్పంచులకు ఇంటర్మీడియట్, వార్డు మెంబర్లుగా పోటి చేయాలని అనుకునే వారికి కనీస విద్యార్హతగా పదవ తరగతిని నిర్ణయించాలని జగన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 

చదువుకున్న వారిని  రాజకీయాల్లోకి ఆహ్వానించాలన్న ఆలోచనతోనే జగన్  ఈ విధంగా ఆలోచిస్తున్నట్లు పార్టీలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. సర్పంచులు, ఎంపిటిసి, జడ్పిటిసిలు, ఎంపిపిలు, వార్డు సభ్యులు అన్నీ పోస్టులు కలిపి సుమారు  1.55 లక్షల దాకా ఉంటాయి. కాబట్టి ఏదో ఒక విద్యార్హత ఉన్న వారిని రాజకీయంగా ప్రోత్సహించాలని, ఆహ్వానించాలని జగన్ అనుకోవటం మంచిదే.

 

జగన్ అనుకున్నట్లే క్షేత్రస్ధాయిలో ప్రజలతో నిత్యం సంబంధాలు కలిగుండే పోస్టులకు విద్యార్హతలను గనుక అమలు చేయగలిగితే  బహుశా దేశంలోనే మొదటి రాష్ట్రమవుతుందేమో ? ఇప్పటికే అనేక నిర్ణయాలతో సంచలనాలు సృష్టిస్తున్న జగన్ స్ధానిక సంస్ధల ఎన్నికల విషయంలో కూడా సంచలనం రేపేలాగే ఉన్నాడు. జగన్ నిర్ణయం గనుక అమల్లోకి వస్తే ప్రతిపక్షాలకు ఇబ్బందనే చెప్పక తప్పదు.

 

ఇప్పటికే చాలా అంశాల్లో ప్రతిపక్షాలకు జగన్ చాలా సార్లే షాకిచ్చాడు. ప్రస్తుతం రాజధాని తరలింపు ప్రతిపాదనతో ప్రతిపక్షాలకు ప్రధానంగా  తెలుగుదేశంపార్టీకి  కోలుకోలేని షాకిచ్చాడు జగన్.  షాకుల మీద షాకులను ప్రతిపక్షాలు తట్టుకోలేకపోతున్న నేపధ్యంలో చివరకు స్ధానిక ఎన్నికల్లో కూడా మరో షాక్ తగిలితే అంతే సంగతులు. చూద్దాం ప్రభుత్వం నోటిఫికేషన్లో ఏం చెబుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: