ప్రస్తుతం ఏపీ రాజకీయం అంతా రాజధాని గురించే తిరుగుతోంది. మూడు రాజధానుల ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం సూచనప్రాయంగా అసెంబ్లీలో తెలిపిన సంగతి తెలిసిందే. త్వరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి అధికారికంగా ఈ విషయంపై క్లారిటీ ఇవ్వనుంది. మరో వైపు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు దీనిని అడ్డుకునేందుకు తాను చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. అమరావతి ప్రాంతంలో రైతులు రోడ్ల మీదకు వచ్చారు. రాజధాని అంశంపై హైకోర్టు జోక్యం చేసుకోవాలని కొందరు పిటిషన్లు కూడా వేశారు.

 

 

రాజధాని తరలింపు అంశంలో జోక్యం చేసుకోవాలంటూ గుంటూరుకు చెందిన న్యాయవాది కొర్రపాటి సుబ్బారావు హైకోర్టులో పిటిషన్ వేసారు. ఈ అంశంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలే చేసింది. రాజధాని తరలింపుపై ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు ఇవ్వనప్పుడు తాము ఎలా జోక్యం చేసుకోగలమని పిటిషనర్‍ను హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని తరలింపు ఒక్క రోజులో పూర్తయ్యే ప్రక్రియ కాదని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ విషయంలో అత్యవసర విచారణ అవసరం లేదని హైకోర్టు తెలిపింది. ఈ అంశంపై కావాలంటే సంక్రాంతి సెలవుల తర్వాత పిటిషన్ వేయాలని పిటిషనర్ కు సూచించింది. ప్రభుత్వ నిర్ణయాలపై కోర్టులు జోక్యం చేసుకోవని గతంలో కూడా పలుమార్లు కోర్టులు తెలిపాయి.

 

 

ప్రస్తుతం రాజధాని అంశం తీవ్ర జటిలమైంది. ఈ విషయంలో పలువురు పలు రకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. మూడు రాజధానులు ఏర్పాటైనా అమరావతి ప్రాంతం కూడా ఒక రాజధానిగా కొనసాగుతుందని చెప్తోంది. భూములిచ్చిన రైతులకు నష్టం ఉండదని కూడా ప్రభుత్వం చెప్తోంది. ప్రభుత్వం దీనిపై స్పష్టతనిస్తోంది. ఆ భూములు మళ్లీ వ్యవసాయానికి అనుకూలం కావని రైతులు అంటున్నారు. ఇరవై మూడు రోజులుగా రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి రాజధాని తరలింపు అంశం తీవ్ర చర్చనీయాంశమైంది. మరి ఈ అంశం ఎప్పుడు కొలిక్కి వస్తుందో వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: