ఈరోజు చిత్తూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల్లో కీలకమైన అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించారు. ప్రతిష్టాత్మకంగా భావించే అమ్మఒడి పథకం ద్వారా పాఠశాలలకు పంపించే పిల్లల తల్లులకు ఆర్థిక సాయం అనగా ప్రతి సంవత్సరం రూ.15వేలు అందించే లక్ష్యంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు జగన్. అయితే 43 లక్షల మంది లబ్ధిదారులకు ఈ అమ్మ ఒడి పథకం వర్తిస్తుందని తెలుస్తోంది.



ఇకపోతే చిత్తూరు జిల్లాలో జరిగిన అమ్మఒడి పథకం యొక్క ప్రారంభ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్, నగరి ఎమ్మెల్యే రోజా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా ఆమె జగన్ ని బాగా పొగిడారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని కూడా తీవ్రంగా విమర్శించారు.


ఆమె మాట్లాడుతూ... ' ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అలాగే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. పేదల చదువు కోసం అమ్మ ఒడి పథకాన్ని తీసుకు వచ్చిన చరిత్రకారుడు ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి అని గర్వంగా చెప్పగలం. పేదల చదువుని కార్పొరేట్ స్కూళ్ళకు, కాలేజీలకు బలిచేసిన చరిత్ర హీనుడు చంద్రబాబు. పేద పిల్లలు చదివే ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి. కానీ పేదలు చదివే ఆరువేల పాఠశాలను మూసివేసిన చరిత్ర హీనుడు చంద్రబాబు నాయుడు. మధ్యాహ్న భోజనంలో పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించిన చరిత్రకారుడు జగన్మోహన్ రెడ్డి. కానీ ఆ పేద పిల్లలు తినే గుడ్లను కూడా మింగేసిన చరిత్ర హీనుడు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చు.' అని జగన్ ముందే చంద్రబాబు నాయుడిని విమర్శించారు రోజా. అయితే, ప్రతి సందర్భంలోనూ చంద్రబాబును విమర్శించకుండా రోజా ఉండలేదని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: