దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జేఎన్‌యూ విద్యార్థులు రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీ చేపట్టి జేఎన్‌యూ వీసీని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు వెంటనే అలెర్ట్ అయి శాస్త్రిభవన్ దగ్గర విద్యార్థులను అడ్డుకున్నారు. పోలీసులు అడ్డుకోవటంతో పోలీసులతో విద్యార్థులు వాగ్వాదానికి దిగారు. పోలీసులు, విద్యార్థుల మధ్య వాగ్వాదం పెరగటంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 
 
ఈరోజు ఉదయం నుండి జేఎన్‌యూలో జరిగిన ఘటనల గురించి జేఎన్‌యూ విద్యార్థులు ఆందోళన తెలుపుతున్నారు. ఈరోజు ఉదయం కేంద్ర మానవ వనరుల శాఖా మంత్రి కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహించిన విద్యార్థులు జేఎన్‌యూలో పెంచిన ఫీజులను తగ్గించాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మూడు గంటలపాటు జేఎన్‌యూలో జరిగిన హింసాత్మక ఘటనల గురించి కూడా ధర్నా చేశారు. 
 
పోలీసులు నలుగురు విద్యార్థులను మంత్రితో కలిసేలా చర్యలు తీసుకోగా మంత్రికి విద్యార్థులకు మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. చర్చలు విఫలం కావడంతో విద్యార్థులు రాష్ట్రపతి భవన్ వైపు వెళ్లటానికి సిద్ధమయ్యారు. రాష్ట్రపతితో మాట్లాడటానికి విద్యార్థులు ప్రయత్నం చేయటంతో పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. విద్యార్థులు పోలీసులపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయటంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. విద్యార్థులు, ప్రభుత్వం మధ్య చర్చ జరగకపోవటంతో సమస్యలు పరిష్కారం కావటం లేదు. ఫీజులు పెంచితే తాము భరించలేమని విద్యార్థులు చెబుతున్నారు. జేఎన్‌యూలో ఈ నెల 5న ముసుగు ధరించిన వ్యక్తులు జరిపిన దాడిలో దాదాపు 30 మంది విద్యార్థులు, బోధకులు గాయపడ్డారు. గాయపడినవారిలో జేఎన్‌యూఎస్‌యూ ప్రెసిడెంట్ ఐషే ఘోష్ కూడా ఉన్నారు. ఈ హింసాత్మక దాడిని అన్ని రాజకీయ పార్టీలు ఖండించాయి. ఈ నెల 5న జరిగిన హింసాత్మక సంఘటనలపై దర్యాప్తు జరిపేందుకు ఐదుగురు సభ్యుల కమిటీని వైస్ ఛాన్స్‌లర్ ఎం జగదీశ్ కుమార్ ఏర్పాటు చేశారు.
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: