నిర్భయ కేసులో ఉరిశిక్ష పడ్డ దోషి వినయ్ శర్మ సుప్రీంకోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు దోషుల్ని ఉరితీయాలని ఢిల్లీ హైకోర్టు డెత్ వారెంట్ ఇచ్చింది. వినయ్ శర్మను ఉరి శిక్ష నుంచి తప్పించాలన్న అతడి లాయర్.. దోషి కుటుంబ, సామాజిక నేపథ్యాన్ని ప్రస్తావించడం హాట్ టాపిక్ గా మారింది. 

 

నిర్భయ హత్యాచారం కేసు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ సుప్రీం కోర్టులో క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ నెల 22న నిర్భయ కేసు నిందితులు నలుగురినీ ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు మంగళవారం డెత్ వారెంట్ జారీ చేసింది. వినయ్ శర్మ తరపున క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేసిన న్యాయవాది ఏపీ సింగ్ పిటిషన్‌లో వినయ్ శర్మకు ఉరిశిక్షను తప్పించాలంటూ పిటిషన్‌లో పలు కారణాలను ప్రస్తావించారు.


నిర్భయ ఘటన జరిగినప్పుడు వినయ్ వయసు 19 సంవత్సరాలేనని.. కోర్టు ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన కోరారు. అంతేకాదు, అతను వయసులో చిన్నవాడని, సామాజికంగా.. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబ నేపథ్యం కలిగిన వాడని... ఈ కారణాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని వినయ్ తరపు న్యాయవాది ఏపీ సింగ్ కోర్టును కోరారు.


తీర్పు వల్ల తమకు అన్యాయం జరిగిందనీ... రివ్యూ పిటిషన్‌ను తోసిపుచ్చడంలో సహజ న్యాయాన్ని పాటించలేదంటూ కోర్టుకు విన్నవించేందుకు క్యూరేటివ్ పిటిషన్ దాఖలు చేస్తారు. అయితే నిందితులు తమ వాదనను బలపరిచే అంశాలను క్యూరేటివ్‌ పిటిషన్‌లో స్పష్టంగా వివరించాల్సి ఉంటుంది. దీనిని సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తులు పరిశీలిస్తారు. క్యూరేటివ్‌ పిటిషన్‌‌లో బలమైన కారణాలు లేవని భావిస్తే... దానిని తోసిపుచ్చడంతోపాటు కోర్టు ఖర్చులు చెల్లించాలని కూడా ఆదేశించే అవకాశం ఉంది. నిర్భయ నిందితుడు వినయ్ శర్మ దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్ సర్వసాధారణమే అయినా.. కోర్టు కూడా కనికరించేది లేదని ఇప్పటికే తెగేసి చెప్పింది. దీంతో అతనికి ఉరిశిక్ష పడటం ఖాయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: