అగ్రరాజ్యం అమెరికా, ఇరాన్‌ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. బాగ్దాద్‌ సమీపంలోని అమెరికన్‌ స్థావరాలపై ఇరాన్‌ చేసిన క్షిపణి దాడిపై స్పందించిన యూఎస్‌ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌..  ఇరాన్‌ను తీవ్రస్థాయిలో హెచ్చరించారు. తమ కీలక కమాండర్‌ సులేమానీ హత్యకు ప్రతీకారంగా... బాగ్దాద్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్‌ క్షిపణి దాడులకు దిగడంతో ప్రపంపచమంతా ఉలిక్కిపడింది. ఈ దాడిలో అమెరికాకు చెందిన యుద్ధ విమానం కాలిపోయినట్టు తెలిసింది. అయితే దీనిపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరించారు. తీరు మార్చకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు.

 

బాగ్దాద్‌లో ఇరాన్‌ జరిపిన క్షిపణి దాడిలో అమెరికన్‌ సైనికులెవ్వరూ చనిపోలేదని డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అమెరికన్‌ పౌరులందరూ క్షేమంగా ఉన్నారన్నారు. ఇరాన్‌ తీరు మార్చుకోవాలని అది.. ఆ దేశానికే కాదు, ప్రపంచానికీ మంచిదన్నారు. సులేమానీని అంతమొందించడాన్ని సమర్థించుకున్న ట్రంప్‌.. ఈ పని ఎప్పుడో చేయాల్సిందన్నారు. ప్రపంచ టెర్రరిస్టుల్లో టాప్‌ లిస్టులో ఉన్న సులేమాని.. ఎంతో మంది అమాయక ప్రజల ప్రాణాలను బలి తీసుకున్నాడని చెప్పారు. అందుకే అమెరికన్‌ సైన్యం అతడిని  మట్టుబెట్టిందని స్పష్టం చేశారు.

 

ఇక అమెరికాలో ఇప్పటికే చాలా నేచురల్‌ గ్యాస్‌ నిల్వలు ఉన్నాయన్న ట్రంప్‌... ప్రపంచంలోనే అత్యధిక ఉత్పత్తి తమ దగ్గర జరుగుతోందన్నారు. గల్ఫ్‌ప్రాంతంలో లభించే చమురు తమకు అవసరం లేదన్నారు. ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడంలో ఇరాన్‌ ఎప్పుడూ ముందుంటుందన్న ట్రంప్‌.. భవిష్యత్తులో దాని ఆటలు సాగనివ్వబోమన్నారు. ప్రపంచదేశాలన్నీ దాని నిజస్వరూపాన్ని ఇప్పటికైనా గుర్తించాలన్నారు.

 

మరోవైపు ఇరాన్‌ కూడా అగ్రాజ్యంపై తీవ్రస్థాయిలో స్పందించింది. అమెరికా మరోసారి దాడులకు దిగితే.. తీవ్రమైన ప్రతిదాడులు ఉంటాయని హెచ్చరించింది. అమెరికా స్థావరాలపై క్షిపణి దాడి అనంతరం స్పందించిన ఇరాన్‌ అధ్యక్షుడు హసన్‌ రౌహానీ.. తెలివైనదైతే అమెరికా మరోసారి దాడులకు తెగబడదని భావిస్తున్నట్టు చెప్పారు. అమెరికా విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గబోమని స్పష్టం చేశారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: