ఆస్ట్రేలియా దేశంలోని ఆగ్నేయ ప్రాంతంలో గత కొన్ని నెలలుగా కార్చిచ్చు కొనసాగుతుందని.. అగ్నిమాపక అధికారులు మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారని మనకి తెలుసు. తమ దేశ ప్రజలను కాపాడే ప్రయత్నంలో ఇప్పటికే పదుల సంఖ్యలో అధికారులు చనిపోయారు. పెళ్ళై నాలుగు సంవత్సరాల గడవకముందే ఈ ఫైర్ ఫైటర్స్ మరణించడంతో వారి పిల్లలంతా చిన్నతనంలోనే తండ్రి లేని అవుతున్నారు. ఏమి తెలియని ఆ చిన్న పిల్లలను చూస్తే ప్రతి ఒక్కరికి మనసు కలుక్కుమనిపిస్తుంది.


విషాదకరమైన విషయమేంటంటే.. ఈ కార్చిచ్చు ఇంకా కొన్ని నెలల పాటు కొనసాగుతుందట. దాంతో, అగ్నిమాపక అధికారులు నిరంతరాయంగా శ్రమిస్తూ మంటలను ఆర్పుతున్నారు. అయితే, ఈ క్రమంలోనే ఆండ్రూ ఒ'ద్వేర్ అనే ఒక అధికారి తన ప్రాణాలను కోల్పోయారు. అయితే, ఆండ్రూకు నివాళులు అర్పించడానికి వేలాది మంది అతని అంత్యక్రియలకు హాజరుకాగా.. ఆ దేశ మీడియా ఈ దృశాలను క్లిక్ మనిపించాయి. అయితే, వారు తీసిన ఒక ఫోటో మాత్రం అందరిని కంటతడి పెట్టిస్తుంది.


ఆ ఫొటోలో ఆండ్రూ కూతురు షార్లెట్ తన తండ్రి శవపేటిక పక్కనే ఆడుకుంటూ ఉంటుంది. పాపం, ఆ చిట్టితల్లికి తన నాన్న ఇక రాడని తెలియక అటు ఇటు గెంతులేస్తుండడంతో ఆమె అమాయకత్వాన్ని చూసి నెటిజన్లు కంటతడి పెడుతున్నారు. శాంతించని ఈ మంటల వలన ఎన్నో విషాదకరమైన ఘటనలు చోటుచేసుకొని వాటికి సంబంధించిన దృశాలు నెట్టింట ప్రత్యక్షమై చాలా బాధిస్తున్నాయి. ఆ ఫోటోలను చూడగానే ప్రతిఒక్కరూ ఈ దారుణమైన మంటలు ఆరిపోవాలని కోరుకోవడమే. డిసెంబర్ 19న మరణించిన ఆండ్రూ యొక్క కూతురు తన తండ్రి స్పెషల్ సర్వీస్ మెడల్ ను, ఇంకా హెల్మెట్ ను ధరించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా కార్చిచ్చు త్వరలోనే పూర్తిగా తగ్గిపోవాలని మనం ఆశిద్దాం. 

మరింత సమాచారం తెలుసుకోండి: