శివసేన సెక్యులర్ వాదం దిశగా అడుగులేస్తోంది. కూటమితో కలిసి లౌకికవాద పార్టీగా ముద్ర వేయించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాన్ని అవకాశంగా మలుచుకుంటోంది నవనిర్మాణ్ సేన. ఎంఎన్‌ఎస్ చీఫ్ రాజ్‌ఠాక్రే.. ఫడ్నవీస్ తో భేటీఅయ్యారు. కొత్తపార్టీ దిశగా ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. 

 

మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. చిరకాల నేస్తం బీజేపీతో తెగదెంపులు చేసుకున్న శివసేన... ప్రత్యర్థి పార్టీలతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. దీనికి తోడు సావర్కర్ వివాదంలోనూ పెద్దగా మాట్లాడింది లేదు. దీంతో కూటమితో కలిసి శివసేన లౌకికవాదం దిశగా అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన..వేగం పెంచింది. అందులో భాగంగానే.. విపక్ష బీజేపీనేత ఫడ్నవీస్‌తో ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ ఠాక్రే భేటీ అయినట్లు తెలుస్తోంది.  రెండు గంటల పాటు వీరిద్ధరూ ఏకాంతంగా చర్చలు జరిపినట్లు సమాచారం. 

 

మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 288 స్థానాలకు గానూ, ఎంఎన్ఎస్ తరపున కేవలం రాజ్ థాకరే ఒక్కరే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయన నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అప్పట్లో బీజేపీయేతర వర్గాలన్నీ ఆయనకు జేజేలు పలికినా అవి ఓట్లుగా మారలేదు. అయితే అక్టోబర్ ఎన్నికల తర్వాత మహారాష్ట్రలో పరిస్థితులు వేగంగా మారిపోయాయి. బీజేపీకి దూరం జరిగిన శివసేన అనూహ్యంగా కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ రెండు పార్టీలతో సఖ్యత సాధించేందుకు కనీస ఉమ్మడి ప్రణాళిక పేరుతో శివసేన సైతం సెక్యులర్ ముద్ర వేసుకుంది. దీంతో ఇప్పుడు హిందూత్వ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎంఎన్ఎస్ తహతహలాడుతోంది. 

 

మరోవైపు ఈ నెల 23న రాజ్ థాకరే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటించొచ్చని తెలుస్తోంది. శివాజీ మహరాజ్ రాజముద్రతో పార్టీ కొత్త జెండా కూడా ఆవిష్కరించనున్నట్టు సమచారం. జనవరి 23న శివసేన వ్యవస్థాపకుడు, రాజ్ థాకరే రాజకీయ గురువు బాల్ థాకరే జయంతి కావడంతో.. ఆ రోజునే ముహూర్తంగాఎంచుకున్నట్లు తెలుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: