ఈ వార్త చదివితే ఏంటీ విచిత్రం అనిపించకమానదు కదా.. అవును మరి ఎన్టీఆర్ కిడ్నాప్ కావడం ఏంటి.. కాకపోతే ఇది నిజమే.. అయితే కిడ్నాప్ అయ్యింది మాత్రం ఎన్టీఆర్ కాదు.. ఆయన విగ్రహం.. అవును ఇది మరీ విచిత్రంగా ఉంది కదూ.. కానీ ఇది నిజమే. విశాఖపట్నం మధుర వాడ మార్కెట్ రోడ్డులో ఉన్న ఎన్.టి.ఆర్. విగ్రహాన్ని కొందరు వ్యక్తులు పెకలించుకుని పోయారు. మరి ఇలా ఎందుకు జరిగిదో తెలియదు కానీ.. ఇప్పుడు ఇది హాట్ టాపిక్ అయింది ఆ ప్రాంతంలో.

 

విశాఖపట్నంలో ఎన్.టి.ఆర్.విగ్రహాన్ని ఎవరో తీసుకుపోయారంటూ టీడీపీ నేతలు ఏకంగా పోలీసు కేసు పెట్టారు. అయితే ఇది అపహరణో, మరొకటో తెలియదు. విశాఖపట్నం తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పి.ఎమ్.పాలెం పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై కంప్లయింట్ ఇచ్చారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

 

సాధారణంగా మనుషుల్ని కిడ్నాప్ చేస్తారు. కానీ ఇక్కడ కిడ్నాప్ అయ్యింది ఓ విగ్రహం. గతంలోనూ రాష్ట్రంలో విగ్రహాలను అవమానించడం జరిగింది. అంబేడ్కర్ విగ్రహాలను అగ్ర కులాల వారూ.. వైఎస్ విగ్రహాలను తెలుగుదేశం వారూ.. ఎన్టీఆర్ విగ్రహాలను కాంగ్రెస్ పార్టీ వారూ.. అవమానించడం వంటి ఘటనలు చాలా జరిగాయి. ఈ నేతల పేర్లు మచ్చుకు కొన్ని మాత్రమే కేవలం రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలే కాదు. సంఘ సంస్కర్తలు, స్వాతంత్ర్య పోరాట యోధుల విగ్రహాలకూ అవమానాలు తప్పలేదు.

 

ఇక్కడ విచిత్రం ఏంటంటే.. విగ్రహాన్ని అవమానించలేదు. రంగులు పూయలేదు. లేదా పాక్షికంగా ధ్వంసం చేయలేదు.. కానీ ఏకంగా విగ్రహమే లేకుండా చేశారు. మరి విగ్రహాన్ని ఎత్తుకు వెళ్లి ధ్వంసం చేశారా లేదా అన్నది తెలియదు. సాధారణంగా ఏ విగ్రహంపై కోపం ఉన్నా దాన్ని ప్రదర్శించేందుకే అవమానిస్తారు. మరి ఇక్కడ విగ్రహాన్ని ఏకంగా మాయం చేయడం మాత్రం విచిత్రమే.. కాదంటారా..?

మరింత సమాచారం తెలుసుకోండి: