ఇంట్లో పనికి చేరడం... ఇళ్లంతా దోచుకోవడం.. ఇదీ ఆ గ్యాంగ్‌ స్టైల్‌. వారం తిరక్కముందే యజమానులను ఫుల్లుగా నమ్మించేస్తారు. సొంత మనుషుల కంటే ఎక్కువగా అభిమానించేలా చేసుకుంటారు. అదను చూసి దోపిడీ చేస్తారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ తరహా దోపిడీ... ఇప్పుడు పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టిస్తోంది. 

 

మారుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే.. దొంగలు కూడా చోరకళల్లో ఆరితేరుతున్నారు. ఇల్లు గుల్లయ్యాక గానీ.. వాళ్లు చేసిన మోసం బయటపడదు. సైబరాబాద్‌ కమిషనరేట్, నార్సింగ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఇలాంటి ఘటన ఉలిక్కి పడేలా చేసింది. అలర్ట్‌ అయిన పోలీసులు...ఇలాంటి గ్యాంగ్స్‌ ఎన్ని ఉన్నాయా? అని వెతికే పనిలో పడ్డారు. ధనవంతుల ఇళ్లను టార్గెట్‌ చేసే ముఠాలు... ఇళ్లల్లో వంట మనుషులుగా, పని మనుషులుగా ఏజెన్సీల ద్వారా వచ్చి చేరతారు. ఇంటి యజమానేమో ఏజన్సీ నుంచి హైర్‌ చేసుకున్నాం కదా అనే ధీమాలో ఉంటున్నారు. కానీ వీళ్లెంత కేటుగాళ్లనే విషయం ఏజెన్సీ వాళ్లకు కూడా తెలియదు. 

 

ఓ నేపాలీ జంట హైదరాబాద్‌లోని బిజినెస్‌ మెన్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది. కోకాపేట, ఆరిస్టోస్‌ పొలోమీ విల్లా నెంబర్‌ 44 ఉండే వ్యాపారి.. గత నెల 27న పనిమనుషులు కావాలని ప్రైవేటు ఏజన్సీని కలిశారు. వాళ్లు పంపిన ఈ నేపాలీ జంటను చూసి వ్యాపారి ఫ్యామిలీ హ్యాపీగా ఫీలైంది. తనను పవిత్రగా పరిచయం చేసుకున్న మహిళ, ఆమె భర్త.. ఇద్దరూ ఆ ఫ్యామిలీతో బాగా కలిసిపోయినట్టు నటించారు. పనులు చేస్తూనే.. ఇంట్లో అణువణువూ తమ కళ్లతో స్కాన్‌ చేసేశారు. బంగారం, డబ్బు ఎక్కడ ఉంటాయో తెలుసుకున్నారు. దోపిడీకి స్కెచ్‌ వేశారు. ఈ నెల 3న రాత్రి భోజనంలో ఆ ఫ్యామిలీలోని అందరికీ మత్తు మందు కలిపి పెట్టారు. వాళ్లు మత్తులోకి జారుకోగానే.. నగానట్రా సర్దేసుకుని జారుకున్నారు.

 

మరుసటి రోజు మధ్యాహ్నం వ్యాపారికి.. గచ్చీబౌలీలో ఉండే కుమార్తె ఫోన్‌ చేసింది. ఎంతకీ ఫోన్‌ తీయకపోవడంతో అనుమానం వచ్చింది. ఇంటికొచ్చి చూస్తే విషయం అర్థమైంది. వెంటనే 108తో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చింది. మత్తులో ఉన్న కుటుంబ సభ్యులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఇంట్లోని సీన్‌ చూసిన పోలీసులు...ఇదంతా పనిమనుషుల పనేనని నిర్ధారణకు వచ్చారు. విల్లాలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించిన పోలీసులు... నేపాలీ జంట ఫొటోలను ఇతర రాష్ట్ర పోలీసులకూ చేరవేసి..ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. 

 

నేపాల్‌, బీహార్‌ల నుంచి వచ్చిన ఇలాంటి ముఠాలు.. ఇప్పుడు హైదరాబాద్‌లో తిష్ట వేసినట్టు గుర్తించిన పోలీసులు... ప్రజలంతా కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచిస్తున్నారు. పరారీలో ఉన్న ఈ నేపాలీ జంటను పట్టుకుంటే ..మరిన్ని నేరాలు బైటపడే అవకాశం లేకపోలేదని పోలీసులంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: