దేశ వ్యాప్తంగా దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై  ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. అనేక ఉత్కంఠ పరిస్థితుల నడుమ జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. యావత్‌దేశ దృష్టిని హస్తిన ఆకర్షించింది. ఈ ఎన్నికల్లో దేశ రాజకీయ పటంలోని ప్రధానమైన మూడు పార్టీలు నువ్వా-నేనా అనే విధంగా తలపడుతున్నాయి. ఆమ్‌ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య సాగే ఈ పోరులో విజయం కోసం నేతలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. 

 

అయితే ఈసారి  ఎన్నడూలేని విధంగా బీజేపీలో ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. ఒకవేళ బీజేపీ ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో  విజయం సాధిస్తే సీఎం పదవి ఎవరిని వరిస్తుందనే దానిపై పెద్ద ఎత్తున చర్చలు సాగుతున్నాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 8న పోలింగ్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ సీఎం అభ్యర్థిపై కేంద్రమంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

 

ఆప్‌ కన్వీనర్‌, సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ను ఎదుర్కొనే ధైర్యం, తెగువ ప్రధాని నరేంద్రమోదీకి మాత్రమే ఉందన్నారు. మోదీ ఎన్నికల ప్రచారంలో  ప్రముఖ పాత్ర పోషిస్తారని, ఆయన బలంతోనే ఢిల్లీలో విజయం సాధించి తీరుతామని మంత్రి అభిప్రాయపడ్డారు. అయితే గతంలో మాదిరిగా సీఎం అభ్యర్థిని ముందే ప్రకటించట్లేదని అన్నారు. ఎన్నికల ఎత్తుగడలో భాగంగానే ఇలాంటి సరికొత్త​ వ్యూహాలు రచిస్తున్నట్లు తెలిపారు.పలు రాష్ట్రాల్లో సీఎం అభ్యర్థి విషయంలో  విభిన్న పరిస్థితులను ఎదుర్కొక తప్పదని పేర్కొన్నారు. సీఎం పదవి పార్టీకి కట్టుబడి, విజయం కోసం​ నిబద్ధతతో పనిచేసే వారినే  వరిస్తుందని వ్యాఖ్యానించారు. 

 

కాగా 2008 ఎన్నికల్లో వీకే మల్హోత్రా, 2013 హర్ష వర్థన్‌, 2015 మధ్యంతర ఎన్నికల్లో మాజీ ఐపీఎస్‌ అధికారిని కిరణ్‌బేడీని బీజేపీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ  ప్రయత్నాలేవీ ఫలించలేదు. దీంతో దాదాపు రెండు దశాబ్దాలకు పైగా కమళనాధులు హస్తినలో అధికారానికి దూరంగా ఉండక తప్పడంలేదు. సరికొత్త ఎత్తుగడలతో, మోదీ మ్యానియాతో  ఈసారి అధికారం కైవసం చేసుకోవాలని కట్టుదిట్టమైన వ్యూహాలు రచిస్తున్నారు. అయితే సీఎం అభ్యర్థిగా ఎంపీ మనోజ్‌ తివారీ పేరు మాత్రం బలంగా వినిపిస్తోంది. . అయితే బీజేపీ ఎంచుకున్న వ్యూహాన్ని కాంగ్రెస్‌ కూడా అనుసరించే అవకాశం ఉంది. పోలింగ్‌కు ముందే సీఎం అభ్యర్థిని ప్రకటించే అవకాశాలు ఏమాత్రం కనిపించడంలేదు. దీనిపై కాంగ్రెస్‌ అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: