ఈనాడు పత్రిక తీరుపై మంత్రి బొత్స సత్యనారాయణ విరుచుకుపడ్డారు. ఈనాడు పత్రికలో గురువారం సకల సౌకర్యాల అమరావతి అంటూ ఓ ఫుల్ పేజీ కథనం ఇవ్వడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. ఆయన ఏమన్నారంటే.. “ శ్రీకృష్ణ కమిటీ ప్రాంతీయ అసమానతలు రాకూడదు. ప్రతి ప్రాంతాన్ని సమన్యాయంతో చూడాలని చెప్పింది. శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో రేపు పేపర్లో ప్రింట్‌ వేయండి. రామోజీరావు సమాజం కోసం ఆలోచన చేస్తే.. శివరామకృష్ణన్‌ కమిటీ ఏం చెప్పిందో వేయండి అని మంత్రి నిలదీశారు.

 

"బ్రోకర్ల కోసం, దళారుల కోసం 33 వేల ఎకరాలు ఇచ్చిన నిజమైన రైతులు ఉంటే వారిని ఇబ్బంది పెట్టి లేనిపోనివి సృష్టించడం కోసం కొంతమంది స్వార్థ ప్రజల కోసం చేస్తున్న కార్యక్రమం కాదా..? ఇంకా ఎంత కాలం రైతులను మోసం చేస్తారు. మీకు అనుకూలంగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే ఒక రకంగా వ్యవహరిస్తారు. అంటే ఈ రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు అందరూ మీకు తొత్తులుగా ఉండాలా..? మీ అడుగులకు మడుగులు వత్తాలా..? రామోజీరావు విభజన సమయంలో చేసినట్లుగానే ఇప్పుడు చేస్తున్నారు.

 

రూ.3 వేల కోట్లు పెడితే అంతా అయిపోతుందని మాట్లాడుతున్నాడు. లక్షా తొమ్మిది వేల కోట్ల రూపాయలు కావాలని మీరే రాశారు కాదా.. మీది నోరా.. తాటి మట్టా.. లేక మీ చేతుల్లో ఉంది కలమా.. ఇంకేమైనానా..? మీరు చంద్రబాబు కలిసి ఈ రాష్ట్రంలో కుట్రపన్నుతూ పబ్బం గడుపుకొవాలని చూస్తుంది వాస్తవం కాదా..? హైదరాబాద్‌లో హెడ్‌ ఆఫీస్, జిల్లాకు ఆఫీస్, ప్రింటింగ్‌ కేంద్రం పెట్టారు.. ఉదయానికి పేపర్‌ అందుబాటులోకి రావాలని.. మరి పరిపాలన ప్రజలకు అందుబాటులోకి రాకూడదా..? రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి చెందాల్సిన అవసరం లేదా..? ఏం కావాలని కోరుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి.. అంటూ మంత్రి బొత్స సత్యనారాయణ ఈనాడు దిన పత్రికపై విరుచుకుపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: