తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పై ఆ పార్టీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తీవ్ర స్థాయి విమర్శలు చేశారు . తాత్కాలికం ...తాత్కాలికం అంటూ చంద్రబాబు పిచ్చి పని చేశారని ఆయన మండిపడ్డారు. అమరావతిని అత్యున్నతస్థాయి లో నిర్మించాలన్న ఉద్దేశ్యం తో చంద్రబాబు చేసిన పనిని వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మరొక రకంగా ఉపయోగించుకుంటుందని అన్నారు.

 

రాజధానిని ముక్కలు చేస్తే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం పుట్టుకు వస్తుందన్న జేసీ , రాజధాని కావాలంటే కడపలోనో , పులివెందుల లోనో పెట్టుకోవాలంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు . విశాఖపట్నం, రాయలసీమకు చాలాదూరం అని చెప్పారు . అమరావతికి సెక్రటేరియట్ లేకుండా చేసి , రాయలసీమకు హైకోర్టు ఇవ్వడం వల్ల ఒరిగేదేమి ఉండదని జేసీ అన్నారు . మహాయితే ఓ పది జిరాక్స్ షాపులు వస్తాయని అంతకంటే లాభం ఉండదని చెప్పారు .

 

ఇప్పుడున్న భవనాలతో రూపాయ  ఖర్చు లేకుండా పదేళ్లు నడిపించవచ్చునని చెప్పిన జేసీ , చంద్రబాబు తాత్కాలికం అనడం వల్లే ఇప్పుడు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ  ఇంత అడ్వాంటేజ్ దొరికిందని అన్నారు . మూడు ప్రాంతాల్లో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను  వ్యతిరేకిస్తూనే ,  చంద్రబాబు నాయుడు నిర్వాహకం వల్లే ఇదంతా జరిగిందని జేసీ మండిపడడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతుచిక్కడం లేదు . ఇటీవల బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉంటున్న జేసీ , కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారన్న ఊహాగానాలు కూడా విన్పిస్తున్నాయి .

 

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తనని ఆర్ధికంగా దెబ్బతీయడం తో పాటు , మానసికంగా వేధిస్తున్నారన్న జేసీ , బీజేపీ అండ కోరుకుంటున్నట్లు తెలుస్తోంది . అందుకే అనంతపురం విచ్చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి ని  ఆయన  కలుసుకున్నట్లు సమాచారం . 

మరింత సమాచారం తెలుసుకోండి: