ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీలో పని చేసే డ్రైవర్లకు మరో శుభవార్త చెప్పారు. ఇకనుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీలో పని చేసే డ్రైవర్లకు 8 గంటలకు మించి విధులు లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రభుత్వం ఆర్టీసీ డ్రైవర్ల పని వేళలను అదుపులో ఉంచేలా నిర్ణయం తీసుకుంది. అధికారులు డ్రైవర్లకు సరైన విశ్రాంతి లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని భావించటంతో సీఎం జగన్ అనుమతితో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. 
 
డ్రైవర్లు అదనపు విధులు నిర్వహిస్తామని కోరితే మాత్రమే అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఎండీ ప్రతాప్ ఈ నిర్ణయాలను వెంటనే అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో దూర ప్రాంతాలకు తిరిగే బస్సులు పలు నియోజకవర్గ కేంద్రాలకు వెళుతూ ఉండటంతో ఎక్కువ సమయం వెచ్చించాల్సి వస్తున్నందువలన ముఖ్యమైన నగరాలు మరియు జిల్లా కేంద్రాల వరకే బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నారు. 
 
కండక్టర్లకు సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. కండక్టర్లలో ఎవరైనా ఉన్నత చదువులు చదివిన వారు ఉంటే వారు డిప్యుటేషన్ పై ఇతర శాఖల్లోకి వెళ్లే అవకాశం కల్పించారు. అధికారులు ఆర్టీసీలో ఇకనుండి కార్మిక సంఘాలు ఉండకూడదని సూచనలు చేశారు. కార్మిక సంఘాలను ఉద్యోగ సంఘాలుగా మార్చుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 
 
మరోవైపు సంక్రాంతి పండుగ సందర్భంగా ఏపీఎస్ ఆర్టీసీ 4,200 స్పెషల్ బస్సులు నడుపుతోంది. స్పెషల్ బస్సులలో విధులు నిర్వహించటానికి డ్రైవర్ల కొరత ఉంటే అర్హత ఉన్న బయటివారిని తీసుకోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ ప్రత్యేక బస్సులలో చార్జీ సాధారణ చార్జీ కంటే 50 శాతం చార్జీ అధికంగా ఉంటుంది. ఈ బస్సుల తిరుగు ప్రయాణంలో మాత్రం సాధారణ చార్జీ కంటే 40 శాతం చార్జీ తగ్గనుంది. ప్రభుత్వం అనుమతితో ఆర్టీసీ అధికారులు ప్రకటించిన నిర్ణయాల పట్ల డ్రైవర్లు, కండక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: