పాదయాత్ర ద్వారా జనాల్లోకి వెళ్లి పార్టీ మైలేజ్ పెంచుకునే దిశగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి లో రాజధానిని కొనసాగించాలంటూ   రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళన కార్యక్రమాన్ని టీడీపీ తనకు అనుకూలంగా మార్చుకుని ఆ క్రెడిట్ కొట్టేసింది. మొదట్లో ఈ పోరాటానికి మద్దతు పలికి రాజధాని పరిసర ప్రాంతాల్లో పర్యటించి హడావుడి చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ సందర్భంగా అక్కడ పోలీసు నిర్బంధం సైతం లెక్క చేయకుండా రైతులకు సంఘీభావం తెలిపారు. తన పర్యటనను ముందుకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి రైతులకు మద్దతు పలికారు. ఈ సంఘటనలు జనసేన పార్టీకి బాగా కలిసి వచ్చాయి అని జనసేన ఒక అంచనాకు వచ్చింది.


 అమరావతి ప్రాంతంలో ఒక రకమైన ఉత్సాహం అనేది జనసేన పార్టీ రంగంలోకి దిగాక వచ్చిందని భావించినా ఆ తరువాత ఈ పోరాటాన్ని మధ్యలోనే వదిలేసింది అనే  విమర్శలు కూడా పెద్ద ఎత్తున మూటగట్టుకుంది. ఇటువంటి విమర్శలు తీవ్రం అవ్వడంతో హడావుడిగా పవన్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అయినా ప్రజల నుంచి స్పందన అంతగా లేకపోవడంతో ప్రత్యక్షంగా ఈ పోరాటంలో కి దిగితే కానీ జనాలు నమ్మే పరిస్థితి లేదని అభిప్రాయానికి వచ్చారు. పవన్ గతంలో విశాఖలో నిర్వహించిన లాంగ్ మార్చ్ తరహాలోనే విజయవాడలోనూ నిర్వహించి రాష్ట్ర వ్యాప్తంగా అమరావతి ప్రాంత రైతులకు, జనసేన కు మద్దతు వచ్చేలా తన పర్యటన ద్వారా చేయాలని పవన్ చూస్తున్నారు.


 అదీ కాకుండా ఈ పాదయాత్ర ద్వారా జనసేన పార్టీలో కొత్త ఉత్సాహం వస్తుందనే ఒక రకమైన అభిప్రాయానికి పవన్ వచ్చారు. దీనిపై పూర్తి స్థాయిలో పార్టీ శ్రేణులతో చర్చించిన పవన్ త్వరలోనే ఒక తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు జనసేన పార్టీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇక్కడ కూడా పవన్ పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతం అయితే మరిన్ని సమస్యల మీద ఇదే తరహాలో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై పోరాడాలి పవన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: