ఎన్నికల్లో విపరీతంగా పెరుగుతున్న ధనబలం, ధన ప్రవాహానికి అడ్డుకట్ట వేయాల్సిన సరైన తరుణం ఆసన్నమైందని ఈ దిశగా ఎన్నికల సంఘం తీసుకునే చర్యలతోపాటు ప్రజలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుందని గౌరవ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఎన్నికల్లో ధన ప్రవాహం కారణంగా ప్రజాసంక్షేమం కుంటుపడుతుందని ఆయన సూచించారు. గురువారం హైదరాబాద్ లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాంగణంలో.. ఐఎస్బీ, డాక్టర్ జయప్రకాశ్ నేతృత్వంలోని ఫౌండేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సంయుక్తంగా నిర్వహించిన ‘ఎన్నికల్లో ధనబలం’ అంశంపై జరుగుతున్న రెండ్రోజుల సదస్సును ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంపై విశ్వవ్యాప్తంగా గౌరవం ఉందని.. అయితే.. ఆదర్శవంతమైన ప్రజాస్వామ్యంగా మన దేశాన్ని తీర్చిదిద్దుకోవాలంటే ఎన్నికల్లో, ధన, అంగబలంపై నియంత్రణ అవసరమన్నారు.
ఎన్నికల్లో గెలిచేందుకు అభ్యర్థులు, పార్టీలు అనుసరిస్తున్న విధానాలపై సమీక్ష అవసరమని.. ఇది ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య ప్రక్రియకు విఘాతం కల్పిస్తుందని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రజలు ఈ విషయంలో మరింత బాధ్యతగా వ్యవహరించాలని డబ్బులు తీసుకుని ఓటేయడం కంటే.. నిబద్ధత, సత్ప్రవర్తన, పనిచేయగలిగే సామర్థ్యం ఉన్న అభ్యర్థులను చట్టసభలకు పంపడం వల్లే వారి సమస్యల పరిష్కారానికి బాటలు పడతాయనే విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. డబ్బులిచ్చి గెలిచిన అభ్యర్థులు తర్వాత తమకేదో చేస్తారనుకోవడం పొరపాటన్నారు. 
దేశంలో ప్రతి 6నెలలకోసారి ఒక్కోరాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుండటం వీటిపైనే పార్టీలన్నీ దృష్టిపెట్టడం వల్ల ధనప్రవాహం, ఆర్థిక అక్రమాలు విపరీతంగా పెరిగిపోయి అభివృద్ధి కుంటుపడుతుందన్నారు. అందుకే దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించడం ద్వారా ఎన్నికల్లో అక్రమ ధన ప్రవాహానికి కొంతమేర అడ్డుకట్ట వేయవచ్చన్నారు. ధన బలం, జమిలీ ఎన్నికల విషయంలో అన్ని పార్టీలు ఏకాభిప్రాయసాధనకు కృషి చేయాల్సిన అవసరాన్నీ గౌరవ ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. ఇది అన్నిపార్టీల సంయుక్త బాధ్యతని గుర్తుచేశారు. 
ఎన్నికల్లో ధనబలం కారణంగా ప్రజాస్వామ్యంపై విశ్వాసం తగ్గుతోందని.. ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం మసకబారుతోందన్నారు. కోటీశ్వరులే ఎన్నికల్లో పోటీచేసి గెలిచే పరిస్థితుంటే.. నిజమైన ప్రజాసేవ చేసే వారికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉండదన్నారు. ఇలాంటి పరిస్థితులకు అడ్డుకట్ట వేయడంలో.. పౌరసమాజం, ఆర్థికవేత్తలు, సామాజికశాస్త్రవేత్తలు, మీడియా, మేధావులు, ఈ విషయంలో ప్రజలను చైతన్య పరిచేందుకు చొరవతీసుకోవాలని ఉపరాష్ట్రపతి సూచించారు. ఎన్నికల్లో డబ్బులకు ఆశపడి.. స్వల్పకాల లాభాలను ప్రజలు దృష్టిలో పెట్టుకుంటే దీర్ఘకాల ఇబ్బందులు తప్పవన్నారు. చట్టపరమైన మార్పులు, ఎన్నికల సంస్కరణలతోపాటు ప్రజాచైతన్యం అవసరమని ఉపరాష్ట్రపతి అభిప్రాయపడ్డారు.
రాజకీయ పార్టీలు ఆర్థికపరమైన అంశాల్లో జవాబుదారీతనాన్ని అలవాటు చేసుకోవాలని.. పారదర్శకమైన విధానంతో ప్రజల్లో విశ్వాసం చూరగొనాలని సూచించారు.  70 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా 20శాతం మంది పేదరికంలో 20శాతం మంది నిరక్షరాస్యులుగా ఉండటంపై నిపుణులు, ఆర్థికవేత్తలు ఆలోచన చేయాలని సూచించారు. ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలు సమర్థవంతంగా అమలుకావడంలో నిర్మాణాత్మకమైన సూచనలు చేయాలన్నారు. సంస్కరణల ద్వారా తాత్కాలిక ఇబ్బందులున్నా.. దీర్ఘకాలంలో మంచి జరుగుతుందని దీన్ని ప్రజలు దృష్టిలో ఉంచుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో ఎఫ్ డీఆర్ వ్యవస్థాపకుడు, ప్రధాన కార్యదర్శి జయప్రకాశ్ నారాయణ, హెచ్ సీయూ వీసీ  పొదిలి అప్పారావు, ఐఎస్ బీ డీన్ రాజేంద్రన్ శ్రీవాత్సవ్, మాజీ ఎన్నికల కమిషనర్ టీఎస్ కృష్ణమూర్తితోపాటు ఎఫ్ డీఆర్ రెండ్రోజుల సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన యువతీ యువకులు, వివిధ రంగాల నిపుణులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: