ఒకప్పుడు సంక్రాంతి పండగ వస్తుంది అంటే పల్లెటూరిలో కనిపించే సందడి అంతాఇంతా కాదు.  హడావుడి కనిపిస్తుంది.  హంగామా కనిపిస్తుంది.  ఎక్కడ చూసినా భోగి మంటలు... సందడి వాతావరణం... ఇంకా చెప్పాలి అంటే అద్భుతమైన లోగిళ్ళు కనిపిస్తాయి.  పట్టణాలు, నగరాలు వదిలి జనాలు పల్లెబాట పడతారు.  ఇదంతా ఒకప్పుడు... కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి.  


పండగలకు పట్టణాలు, నగరాల నుంచి ప్రజలు సొంత ఊర్లకు వెళ్లినా...అక్కడ ఆ సందడి కనిపించడం లేదు.  ఏదో వచ్చామా పోయామా అన్నట్టుగా ఉంటోంది.  ఈ పరిస్థితికి కారణం ఏంటి.. ఎవరు ఇలా చేస్తున్నారు అని ఒకసారి ఆలోచిస్తే... మనకు చాలా సంగతులు కనిపిస్తాయి.  రైతుల కడగండ్లు కనిపిస్తాయి.  పంటలు లేక, ఉన్న పంటకు గిట్టుబాటు ధరలు లేక అలమటించే రైతన్నల గుండె చప్పుళ్ళు వినిపిస్తాయి.  


నగరీకరణ పేరుతో రైతుల పొలాలను ప్లాట్స్ గా మార్చేస్తున్నారు.  ఆరుగాలాలు పంటలు పండే భూములు ఇప్పుడు ఎడారిలా మారిపోతున్నాయి.  నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. భారీ వర్షాలతో చేతికొచ్చే పంటలు బుగ్గిపాలు కావడమో జరుగుతున్నది.  ఈ కారణం చేతనే మనిషి ఇలా ఇబ్బందులు పడుతున్నారు.  ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు ఎన్ని బాధలు పడుతున్నారో చెప్పనవసరం లేదు.  


దేశంలో అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకునే వారి జాబితాలో రైతులు ముందు వరసలో ఉంటారు.  సేద్యం చేయడం తప్పించి మరొక పని తెలియని కృషివలుడే అన్ని కష్టాలు వస్తుంటాయి.  ఒకప్పుడు సంక్రాంతి అంటే పండగ.  పండిన ధాన్యం ఇంటికి వస్తుంది.  కానీ, ఇప్పుడు వ్యవసాయం దండగ అనే పెద్దమనుషులు తయారు కావడంతో ఇలాంటి పండగలు సినిమాల్లో చూడటం తప్పించి రియల్ గా చూడలేని పరిస్థితులు వచ్చాయి. భవిష్యత్తులో ఇంటర్నెట్ లో వీటిని చూసి ముసిరిపోవడం తప్పించి రియల్ గా ఎంజాయ్ చేయలేని పరిస్థితులు వచ్చేలా కనిపిస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: