ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాజధాని మార్పు విషయంలో హాట్ హాట్ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నేడు కీల‌క‌మైన‌ హైపవర్ కమిటీ భేటీ జ‌ర‌గ‌నుంది. రాజధాని మార్పు విషయంలో నిర్ణ‌యం తీసుకునేందుకు పదిమంది మంత్రులు, ఇతర అధికారులతో ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ స‌మావేశం జ‌ర‌గ‌నుంది. ఈ కమిటీలో జీఎన్ రావు కమిటీ, బోస్టన్ గ్రూప్ ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు. ఇదే స‌మ‌యంలో హైద‌రాబాద్ వేదిక‌గా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్నాయి. ఏపీ రాజధాని కోసం త‌ర‌లింపును నిర‌సిస్తూ సినీ హీరో మ‌హేష్ బాబు ఇంటి ముదు ప‌లువురు నిరాహార దీక్ష చేప‌ట్టారు.

 

జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి, యువజన పోరాట సమితి పేరుతో ఓ వేదిక ఏర్పాటు చేసిన కొంద‌రు హైదరాబాద్ ఫిలింనగర్‌లో దీక్ష చేప‌ట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని, ఇందుకోసం ఏపీకి చెందిన సినిమా హీరోలు, నటులు స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. నేటి నుంచి 19 వరకూ హీరోలు, న‌టీన‌టుల‌ ఇంటి ఎదుట  ఆందోళన చేస్తామంటూ ప్రకటన చేశారు. వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర అభివృద్ధి మండలి ఏర్పాటు చేయాలన ఆందోళ‌న‌కారులు డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు, అమరావతి వైజాగ్‌లో హైకోర్టు బెంచీలు ఏర్పాటు చేయాలని నిన‌దించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని,  ఏపీ పునర్విభజన చట్టంలోని విభజన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఐదు డిమాండ్లపై జై ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన పోరాట సమితి దీక్ష‌కు సిద్ధ‌మైంది. 

 


కాగా, నేడు జ‌ర‌గ‌నున్న హైపవ‌ర్ క‌మిటీ స‌మావేశంపై అంద‌రి దృష్టి ప‌డింది. అభివృద్ధి వికేంద్రీకరణ, రైతులకు న్యాయం, జిల్లాల అభివృద్ధి తదితర అంశాలపై ఈరోజు ఈభేటీలో చర్చించబోతున్నారు. ఈనెల 20 వ తేదీలోగా ఈ కమిటీ తన రిపోర్ట్ ను ప్రభుత్వానికి అందజేయాలి.  ఇందులో భాగంగానే ఈ భేటీ అవుతున్నారు. మొత్తంగా ఏపీ రాజ‌ధాని అంశం ఇటు అమ‌రావ‌తిలో అటు హైద‌రాబాద్‌లో హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: