పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం (సీఏఏ) విష‌యంలో రాజ‌కీయాలు మారుతున్నాయి. కేంద్ర ప్ర‌భుత్వం ఈ విష‌యంలో దూకుడుగా వెళుతుండ‌గా.. విప‌క్షాలు సైతం అదే రీతిలో స్పందిస్తున్నాయి. తాజాగా  పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.  పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ సోమవారం(జనవరి 13) నాడు ప్రతిపక్షాల నిరసన ర్యాలీకి పిలుపునిచ్చారు. దీనిపై అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో మమతా బెనర్జీ మాట్లాడుతూ... కాంగ్రెస్‌ నీచ రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. అందుకే, సీఏఏపై ఒంటరిగానే పోరు చేయనున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు.

 

సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై తాము ఒంటరిగానే పోరాటం చేయనున్నట్లు  పశ్చిమ బెంగాల్‌ సీఎం తెలిపారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాల రాజకీయాల కారణంగా తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఢిల్లీలోని ప్రతిపక్ష నాయకులు ఈ విషయంలో తనను మన్నించాల్సిందిగా మమతా బెనర్జీ కోరారు. సీఏఏ, ఎన్‌ఆర్‌సీపై పోరాటం ఏ విధంగా చేయాలో ఎవరూ తనకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సీఏఏపై పోరాటం కొనసాగనున్నట్లు అదేవిధంగా ఎన్‌ఆర్‌సీని రాష్ట్రంలో ఎట్టిపరిస్థితుల్లో అనుమతించేది లేదని మమతా బెనర్జీ పేర్కొన్నారు. జ‌న‌వరి 8న ట్రేడ్‌ యూనియన్స్‌ భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చిన ఘటనలో సీపీఎం రాష్ట్రంలో ఏ విధంగా బస్సుల ధ్వంసానికి పాల్పడిందో చూశామని లెఫ్ట్ పార్టీల‌పై మమతా బెనర్జీ మండిప‌డ్డారు. 

 

ఇదిలాఉండ‌గా, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని, దాన్ని ర‌ద్దు చేయాల‌ని దాఖ‌లైన పిటిష‌న్‌పై ఇవాళ సుప్రీంకోర్టు విచార‌ణ చేప‌ట్టింది. సీఏఏను రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించాల‌ని త‌న పిటిష‌న్‌లో కోరిన న్యాయ‌వాది వీన‌త్ ధండా సీఏఏపై త‌ప్పుడు ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న కార్య‌క‌ర్త‌లు, విద్యార్థులు, మీడియా సంస్థ‌ల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. అయితే, దీనిపై చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే ఘాటుగా స్పందించారు. పార్ల‌మెంట్‌లో పాసైన ఓ చ‌ట్టాన్ని రాజ్యాంగ వ్య‌తిరేక‌మ‌ని ఎలా ప్ర‌క‌టిస్తార‌ని చీఫ్ జ‌స్టిస్ ప్ర‌శ్నించారు. దేశంలో సంక్లిష్ట ప‌రిస్థితులు నెల‌కొన్నాయ‌ని చీఫ్ జ‌స్టిస్ ఎస్ఏ బోబ్డే తెలిపారు. చాలా సంక్లిష్ట‌మైన ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇలాంటి పిటిష‌న్లు ఏమీ చేయ‌లేవ‌న్నారు. అయితే దేశ‌వ్యాప్తంగా హింసాత్మ‌క అల్ల‌ర్లు ఆగితేనే, పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టం వ‌ర్తింపు అంశంపై పిటిష‌న్లు స్వీక‌రిస్తామ‌ని చీఫ్ జ‌స్టిస్ తెలిపారు.ప్ర‌స్తుతం శాంతిని నెల‌కొల్పేందుకే మ‌నం ప్ర‌య‌త్నించాల‌ని ఆయ‌న సూచించారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: