ఉత్తరాంధ్ర జిల్లాల్లో కీలక నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాజీ మంత్రి, ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గట్టి షాక్ ఇచ్చారు. ఇప్పటికే ఆయన పార్టీ మారుతారనే సమాచారంతో గత కొంతకాలంగా ఆయన మీద నిఘా పెట్టిన బాబు ఇప్పుడు పూర్తిగా ఆయన్ను పక్కన పెట్టేసినట్టుగా కనిపిస్తున్నారు. దానిలో భాగంగానే త్వరలో ఏపీలో జరగబోతున్న స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలను గంటా శ్రీనివాసరావు వియ్యంకుడు మాజీ పురపాలక శాఖ మంత్రి నారాయణ కు అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాంధ్ర ప్రాంతం టిడిపి బాధ్యత మొత్తం నారాయణ మీదే పెట్టినట్టు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి పార్టీ నుంచి అధికారిక ఉత్తర్వులు ఇంకా వెలువడలేదు.


నారాయణకు 2014 ఎన్నికల ముందు ఉత్తరాంధ్ర టిడిపి బాధ్యతలను చంద్రబాబు అప్పగించారు. ఆ బాధ్యతను ఆయన సక్రమంగా నిర్వర్తించారు. దాని ఫలితంగానే ఉత్తరాంధ్రలో టిడిపి మెజార్టీ స్థాయిలో సీట్లను సాధించగలిగింది. ప్రస్తుతం టిడిపి ఉన్న పరిస్థితుల్లో మరోసారి ఆయనకు బాధ్యతలు అప్పగించడం ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల్లో టిడిపి అభ్యర్థులను గట్టెక్కించగలరనే నమ్మకంతో ఆయనకు ఉత్తరాంధ్ర బాధ్యతలను అప్పగించబోతున్నట్టు తెలుస్తోంది. 


ఆ ప్రాంత నాయకులు కూడా నారాయణ నాయకత్వంలో తాము పనిచేస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. అయితే దీనిపై గంటా స్పందన ఏంటి అనేది తెలియలేదు. అమరావతి విషయంలో పార్టీ నిర్ణయానికి మద్దతు ప్రకటించిన గంటా తాను పార్టీ మారడం లేదని, తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అంటూ మీడియా ముందు చెప్పారు. అయినా చంద్రబాబు ఆయన మీద నమ్మకం లేనట్టుగానే వ్యవహరిస్తున్నట్టు అర్ధం అవుతోంది. 
అయితే ఈ విషయంలో గంటా కాస్త గుర్రుగా ఉన్నట్టు సమాచారం. తాను పార్టీ మారడంలేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పినా బాబు నమ్మడం లేదని ఆయన తన సన్నిహితుల దగ్గర వాపోతున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: